లక్ష్య సాధనకు కష్టపడి చదవాలి
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచన
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఎన్ని మార్కులొస్తాయని ఆలోచించకుండా కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రేరణ, శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు పదో తరగతి అనేది ఒక మెట్టు మాత్రమేనని, అదే ప్రామాణికం కాదని అన్నారు. ఆ తర్వాత ఇంకా అనేక కోర్సులు చదవాల్సి ఉంటుందన్నారు. ఏ తరగతిలో అయినా నిరంతరం కష్టపడితేనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పారు. తాను కూడా విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పదో తరగతి చదివేటప్పుడు ఇంజనీర్ అవుదామనుకున్నానని, ఆ తర్వాత తన లక్ష్యాన్ని మార్చుకుని పట్టుదలతో చదివి ఐఏఎస్ సాధించానంటూ తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి నుంచి సమయాన్ని వృథా చేయకుండా బాగా చదివి పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులు, వార్డెన్లకు సూచించారు. అనంతరం విద్యాశాఖ రిసోర్స్ పర్సన్లు సైదులు, నాగరాజశేఖర్, నాగరాజు, విజయ భాస్కర్, శ్యాం చందర్‌రావు విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో మెళకువలు నేర్పారు. కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూయ, ఏఎస్‌డబ్ల్యూఓలు హనుమంతరావు, సునీత, హెచ్‌డబ్ల్యూఓలు గజ్వేల్ శ్రీనివాస్, పద్మావతి, శశిరేఖ, కౌసల్య, రామనరసయ్య, స్వప్న, కార్యాలయ సిబ్బంది నరసింహారావు, పార్వతి శశికళ, హేమంత్, సాయి పాల్గొన్నారు.
నీటి ఎద్దడి లేకుండా చూస్తాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చూస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నీటి సమస్య – తీసుకోవాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగు, తాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్ష జరుపుతున్నామని చెప్పారు. అర్హులందరికీ రైతు భరోసా అందేలా చర్యలు చేపడుతున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు అందించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, విద్యుత్ ఎస్‌ఈ జి.మహేందర్, నీటి పారుదల శాఖ ఈఈ రాంప్రసాద్, పౌరసరఫరాల శాఖల అధికారులు త్రినాధ్‌బాబు, రుక్మిణి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment