నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ప్రకృతి పరిరక్షణ
అందరి బాధ్యత
డీఈఓ వెంకటేశ్వరా చారి
మణుగూరు రూరల్ : ప్రకృతిని పరిరక్షించడం అందరి బాధ్యత అని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని సాంబాయిగూడెంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేచర్ క్యాంప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఇతర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నేచర్ క్యాంప్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులు ప్రకృతి, నీరు, నేల, వాయువులు, మొక్కలు వంటివి పరిశీలించే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు, రాష్ట్ర ఎన్‌జీఓ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్ నేచర్ క్యాంప్ గురించి విద్యార్ధులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు గ్రీన్ టీ షర్టులు, వాటర్ బాటిళ్లు, టోపీలు, కాటన్ సంచులు, పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. సాంబాయిగూడెం, రామానుజవరం, మణుగూరు, పినపాక, ఏడూళ్లబయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంఈఓ జి.స్వర్జజ్యోతి, జిల్లా ఎఫ్‌ఏఓ ఎస్.శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం ఎం. శ్రీలత, గైడ్ టీచర్లు వి. కోటేశ్వరరావు, బి.రామిరెడ్డి, కె.రామారావు, టి.కోటేశ్వరరావు, రాము పాల్గొన్నారు.
జేవీఆర్ సీహెచ్‌పీని పరిశీలించిన డైరెక్టర్
సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లిలోని జేవీఆర్ సీహెచ్‌పీని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) పీపీ) కె.వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రవాణా, కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ వద్ద అన్‌లోడింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆ తర్వాత కోల్ ఏరియా, డిశ్చార్జి పాయింట్‌ను కూడా పరిశీలించారు. సీహెచ్‌పీ నుంచి దుమ్ము వెలువడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏరియా జీఎం శాలేంరాజుతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు సూర్యనారాయణ, కోటిరెడ్డి, రామకృష్ణ, ఆర్.ప్రహ్లాద్, నర్సింహారావు, కె.సోమశేఖర్ పాల్గొన్నారు.
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
Comments
Please login to add a commentAdd a comment