సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బంజారా వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక ఇల్లెందు క్రాస్‌రోడ్‌లోని కార్తీక వనంలో శనివారం సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ను బంజారా సంప్రదాయం ప్రకారం తలపాగా చుట్టి ఎద్దులబండిపై వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హింస, మత్తు, ధూమపానాలకు దూరంగా ఉండాలని హితవు పలికి యావత్ ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచారని, బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన విప్లవ చైతన్య మూర్తి అని నివాళులర్పించారు. దేశం గర్వించదగిన గొప్ప ఆధ్యాత్మికవేత్త అన్నారు. ఆయన మార్గంలో అందరూ పయనించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఎల్.భాస్కర్‌నాయక్, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment