14 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంఅర్బన్ : మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు లొంగిపోయారని ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. హేమచంద్రాపురం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని వీరంతా లొంగిపోయారని వివరించారు. వారిలో బీజాపూర్ జిల్లా మంగలతొరు గ్రామానికి చెందిన ఎర్రవల్లి ఆర్‌పీసీ మిలీషియా కమాండెర్ మడివి భీమా, ఎర్రవల్లి ఆర్‌పీసీ సీఎన్‌ఎం అధ్యక్షుడు బోడి ఉంగా, మడివి అడుమ, డీఏకేఎం సభ్యులు కుంజల కోసా, కిష్టారం ఏరియా సీఎన్‌ఎం కమాండర్ కోవాసి నంద, సీఎన్‌ఎం సభ్యుడు మడివి భీమా, మడివి మాసా, బీజాపూర్ జిల్లా దొడ్డి తుమ్నర్ గ్రామానికి చెందిన టైలరింగ్ టీం కమాండర్ కుంజా లక్మా, ఆర్‌పీసీ సభ్యురాలు వెట్టి లక్కే, మిలీషియా సభ్యులు మడవి చుక్కయ్య, వెట్టి కోసా, మడవి భీమా, సోడి రాధికా, కుహ్రామి కాజల్ ఉన్నారని వివరించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయారని, ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ధి పొందాలని, కుటుంబ సభ్యులతో కలిసి జీవనం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ రెండు నెలల్లోనే 44 మంది మావోయిస్టులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్వయంగా సమీప పోలీస్‌స్టేషన్, లేదా జిల్లా ఉన్నతాధికారులను కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందించేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment