సుజాతనగర్ : పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ప్రతీ విద్యార్థి 10/10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. మండలంలోని సర్వారం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన అనంతరం పదో తరగతి వారికి హాల్ టికెట్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యార్థుల జీవితానికి ఈ పరీక్షలు మైలురాయి వంటివని చెప్పారు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తేనే విజయం సాధిస్తారని, దీంతో పాటు ప్రణాళికాయుతంగా చదువుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి ఐటీడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ జనరల్ డేవిడ్‌రాజ్, ఏటీడీఓ చంద్రమోహన్, క్రీడల అధికారి గోపాలరావు, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పరిధిలో 2,665 మంది..
భద్రాచలంటౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 2,665 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బాలురు1,423 మంది, బాలికలు 1,242 మంది ఉన్నారని, వీరంతా 55 ఆశ్రమ పాఠశాలలు, 21 వసతిగృహాలు, మూడు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, 79 ఇతర పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు. ప్రతీ విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని పీఓ ఆకాంక్షించారు.
పదో తరగతి విద్యార్థులకు పీఓ సూచన