పాల్వంచరూరల్ : ‘మొక్కలు నాటండి.. చెట్లు పెంచండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి’ అంటూ ప్రభుత్వం నిత్యం ప్రచారం చేస్తుంటే మరోవైపు అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి పెద్ద పెద్ద వృక్షాలను నేలకూల్చుతున్నారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి వెళ్లే రహదారికి ఇరువైపులా హరితహారంలో రూ.లక్షల వ్యయం చేసి రోడ్డు వెంట నాటిన మొక్కలు పెరిగి పెద్దవై ఆయా గ్రామాల ప్రజలకు, పర్యాటకులకు చల్లని నీడను ఇస్తున్నాయి. అయితే పాల్వంచ నుంచి కరకవాగు – కిన్నెరసాని వరకు 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు అడ్డొస్తున్నాయంటూ విద్యుత్ శాఖ అధికారులు రహదారిపై ఉన్న వృక్షాలను నరికేశారు. కొమ్మలు మాత్రమే కొడతామని అటవీ, ఆర్‌అండ్‌బీ శాఖల నుంచి అనుమతి పొందిన విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ గత పది రోజులుగా పది కిలోమీటర్ల దూరం వరకు చెట్లను నరికించారు. అయినా అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నరికిన వృక్షాల కలపను సొంతానికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న అటవీ అధికారులు వాటిని కలప డిపోకు తరలిస్తున్నారు. కాగా, ఈ విషయమై విద్యుత్ శాఖ కన్‌స్ట్రక్షన్‌విభాగం ఏఈ రాజేశ్‌ను మాట్లాడుతూ.. కిన్నెరసాని రోడ్డులో 33 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను నరికేందుకు ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖల అనుమతి తీసుకున్నామని చెప్పారు.