
గోదావరిని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం వద్ద గోదావరిని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు గురువారం సందర్శించారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి చెందిన డాక్టర్ రవీంద్ర విఠల్ కాలే, ప్రొఫెసర్ ముత్తయ్య పెరుమాళ్ భద్రాచలం కేంద్ర జల సంఘం కార్యాలయ సబ్ డివిజన్ ఇంజనీర్ కె.పృథ్వీరాజ్ నేతృత్వంలో పరిశీలించారు. నూతన బ్రిడ్జిపై ‘ఎంట్రోపీ ఇమేజ్ ప్రాసెసింగ్ బేస్డ్ నాన్ కాంటాక్ట్ డిశ్చార్జ్ మానిటరింగ్ టెక్నిక్’ అనే యంత్రాన్ని అమర్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో నది ఉపరితల ప్రవాహ వేగాన్ని విశ్లేషించి కచ్చితమైన సమాచారం వస్తుంది. వర్షాకాలం వరదల సమయంలో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉపయోగపడనుందని, రానున్న 24 గంటల్లో ఎగువ నుంచి ఎంత వరద వస్తుందో అంచనా వేయవచ్చని తెలిపారు. భద్రాచలంలో ప్రతీ నిమిషానికి పెరుగుతున్న నీటి వేగాన్ని అంచనా వేసి హెచ్చరిక స్థాయి వరద ఎన్ని గంటలకు వస్తుందో గుర్తించవచ్చని, తద్వారా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయొచ్చని వివరించారు.