
ఆకట్టుకుంటున్న గిరిజన పల్లె
భద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో నిర్మించిన గిరిజన మ్యూజియం అందరినీ ఆకట్టుకుంటోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసీల పల్లె జీవితం సాక్షాత్కరించేలా నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఈనెల 6న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్, ప్లే ఏరియా, యువకుల కోసం బాక్స్ క్రిక్రెట్, శాండ్ వాలీబాల్, ఆర్చరీ గేమ్, ఓపెన్ జిమ్‌లు ఇక్కడ నిర్మించారు. ఆదివాసీ రుచుల నుంచి చైనీస్ వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టు రెడీ చేశారు. మరోవైపు మ్యూజియాన్ని గిరిజనుల పండుగలు, వేటలో ఉపయోగించే ఆయుధాలు, ఇళ్లలో వినియోగించే పనిముట్లు, కళాకృతులు, వాయిద్యాల థీమ్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వెరసి మూడు నెలల కాలంలోనే గిరిజన మ్యూజియం ‘మినీ స్టూడియో’గా మారిపోయింది. దీంతో ప్రారంభానికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాబోయే వధూవరులు, బర్త్‌డే పార్టీల కోసం గ్రూపులు గ్రూపులుగా స్థానికులు ఇక్కడికి రావడం మొదలైంది.