
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య ● వివరాలు వెల్లడించిన మానుకోట ఎస్పీ సుధీర్‌రాంనాథ్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే.. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. భద్రాచలంలోని జగదీశ్ కాలనీకి చెందిన తాటి పార్థసారథి, స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వప్నకు తన తల్లిగారి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే, ఏపీలోని ఎటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం పార్థసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
రూ. 5 లక్షలకు సుపారీ..
పార్థసారథికి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్ సూపర్‌వైజర్ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. దీంతో అతడు కొత్తగూడేనికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్, శివశంకర్, ఎటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి హత్య చేయించాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులకు రూ.5 లక్షలకు సుపారీ ఇచ్చాడు.
సెలవులకు వచ్చి వెళ్తుండగా..
ఉగాది, రంజాన్ సెలవుల కోసం పార్థసారథి భద్రాచలం వచ్చి, మార్చి 31న సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్ చేశారు. అనంతరం పార్థసారథి తన బైక్‌పై బయలుదేరాక స్వప్న తన ప్రియుడికి సమాచారం అందించింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును అద్దెకు తీసుకుని పార్థసారథిని వెంబడిస్తూ బోరింగ్‌తండా సమీపంలో అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో స్వప్న, వెంకట విద్యాసాగర్‌లను అరెస్ట్ చేయగా వినయ్‌కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం పార్థసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్, హథీరాం,నరేందర్, రవికుమార్, ఎస్సైలు దీపిక, మురళీధర్, సతీశ్, ఐటీకోర్ పీసీ సుమన్, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.