అశ్వారావుపేటరూరల్: వేసవి నేపథ్యంలో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా పర్యావరణానికి, అటవీ సంపదకు తీరని ముప్పు వాటిల్లుతుంది. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలోని ఊట్లపల్లి బీట్, వేదాంతపురం రిజర్వు ఫారెస్టులో ప్రధాన రహదారి పక్కనే మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు చెలరేగుతూ, వ్యాపించడంతో ఫారెస్టులోని చెట్లు కాలిపోగా పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. దట్టమైన పొగ కారణంగా ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డాల్సి వచ్చింది. కాగా, మంటల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఫారెస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వాచర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.