
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు విశేష పూజలు జరిపారు. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
హైకోర్టు జడ్జి శరత్‌ను కలిసిన కలెక్టర్ జితేష్
బూర్గంపాడు: హైకోర్టు జడ్జి శరత్‌ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. భద్రాచలం వచ్చిన న్యాయమూర్తిని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కలిశారు. జిల్లాలోని పరిస్థితులపై వారు కొద్దిసేపు ముచ్చటించారు.
వెంకన్న సన్నిధిలో నూజివీడు జడ్జి పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఏపీలోని నూజివీడు స్పెషల్ కోర్డు న్యాయమూర్తి జస్టిస్ వి. కృష్ణమూర్తి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం అందించి ఆశీర్వదించారు.
నేటి ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం సెలవు కావడంలో కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించి దరఖాస్తులు అంజేయడానికి కలెక్టేట్‌కు రావొద్దని కలెక్టర్ సూచించారు.
నేటి గిరిజన దర్బార్ రద్దు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని ప్రభుత్వ సెలవు రోజు కావడంతో రద్దు చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరని, గిరిజనులు గమనించి అర్జీలు సమర్పించేందుకు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు.
పర్యాటకుల జలవిహారం
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 362 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్‌లైఫ్ శాఖ రూ.13,285 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,180 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

పెద్దమ్మతల్లికి విశేష పూజలు