
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను ఆదివారం పునఃప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా వరుస సెలవు దినాలు రావడంతో దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో సైతం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంది.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన