
ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లేవి..?
● ఏరియా ఆస్పత్రుల నుంచి బాధితుల తరలింపునకు ఇక్కట్లు ● మండల కేంద్రాల్లో ఉండే 108 వాహనాలపైనే ఆధారం ● అవి గ్రామాలకు వెళ్తుండటంతో సకాలంలో అందని వైద్యం
ఇల్లెందు: జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులకు అంబులెన్స్‌లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మండలానికో 108 వాహనం ఉందని, వాటినే వినియోగించుకోవచ్చనే భావనతో ఆస్పత్రుల అంబులెన్సులను తొలగించారు. వాటి డ్రైవర్లను ఇతర అవసరాలకు ఉపయోగించుకున్నారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భధ్రాచలం, అశ్వారావుపేట, చర్ల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆస్పత్రికీ అంబులెన్సు సౌకర్యంలేదు. గత పదేళ్ల కాలంగా ఉన్న అంబులెన్సులు కూడా తొలగించారు. ఆయా ఆస్పత్రుల నుంచి అత్యవసర వైద్యం కోసం ఖమ్మం, వరంగల్ వంటి ఆస్పత్రులకు తరలించాలంటే 108 వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రమాద, అనారోగ్య బాధితుల కోసం అవి గ్రామాలకు వెళ్తుండటంతో సకాలంలో ఏరియా ఆస్పత్రులకు రావడంలేదు. దీంతో ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా రోగులపై ఆర్థిక భారం పడుతోంది.
ప్రాణాలు కోల్పోతున్నారు..
జిల్లా కేంద్ర ప్రధానాస్పత్రి, ఏరియా ఆస్పత్రితోపాటు జిల్లాలో జిల్లాలో 29 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 376 సబ్ సెంటర్లు ఉన్నాయి. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల నుంచి ఏరియా ఆస్పత్రులకు రిఫరల్ పేషెంట్లు వస్తుంటారు. వారికి ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు కొత్తగూడెం, ఖమ్మం తరలించాల్సి ఉంటుంది. 108 వాహనాలు సమయానికి రాకపోవడంతో వైద్యసేవలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. గత శనివారం రాత్రి ఇల్లెందుకు చెందిన లోథ్ కార్తీక్ సోనూ గుండెపోటుతో అనారోగ్యం పాలు కావటంతో ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యం అందించాక డాక్టర్లు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108కు ఫోన్ చేస్తే అంబులెన్ వచ్చేసరికి గంట దాటింది. దీంతో పరిస్థితి విషమించి బాధితుడు మృతి చెందాడు. అదే ఏరియా ఆస్పత్రికి అనుసంధానంగా అంబులెన్స్ ఉంటే రోగిని సకాలంలో తరలించి ఉన్నత వైద్యం అందించిన ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండేది. ప్రైవేటు అంబులెన్స్‌ల్లో తరలించాలంటే బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇల్లెందు నుంచి ఖమ్మానికి తరలిస్తే సుమారు రూ. 4 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు అందుబాటులో లేక, ప్రైవేటు వాహనాలకు ఖర్చు పెట్టలేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
ఇల్లెందు, మణుగూరు, చర్లలో తప్పనిసరిగా అంబులెన్స్‌లు కావాలని కలెక్టర్ దృష్టికి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏరియా ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రికి కనీసం 40 నుంచి 60 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఉంటే సకాలంలో వైద్యం అందించవచ్చు. సీఎస్‌ఆర్ ఫండ్‌తో మంజూరు చేయాలని లేఖ కూడా అందించాం. ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం ఎంపీలకు కూడా సమస్యను వివరించాం.
–డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్‌ఎస్

ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లేవి..?