
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
దుమ్ముగూడెం: మండలంలోని సీతానగరం, పెద్దనల్లబల్లి, ములకపాడు గ్రామాల్లో మావోయిస్టు పార్టీ కి వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరిట మంగళవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. అందులో మావోయిస్టుల్లారా! నిత్యం ఆదివాసీలపై ఆధారపడి బతికే మీకు.. అడవులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న ఆదివాసీలను అడవుల్లోకి రావొద్దని చెప్పే అధికారం ఎవరిచ్చారు?.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది?.. మీరు అమర్చిన మందుపాతరల వల్ల ఇప్పటికే చాలామంది అమాయక ఆదివాసులు చనిపోయారు.. ఎందరో శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు.. ఇన్ఫార్మర్ల నెపంతో దారుణ హత్యలు చేస్తున్నారు.. ఇలాంటి దుశ్చర్యలు ఆపకపోతే పోరాటం చేస్తామని పోస్టర్లలో ఉంది.