
పోషకాహారంతోనే ఆరోగ్యం
● ఈ నెల 22 వరకు పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు ● ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన ● జిల్లాలోని 2,060 అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహణ
భద్రాచలంఅర్బన్: మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యం పెంపొందించేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోషకాహారం ఆవశ్యకతను వివరించేలా జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పోషకాహారమందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలపై ప్రదర్శనలు చేపట్టామని, తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఎన్‌ఆర్‌సీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పండ్లు, కూరగాయలు, వ్యాయామం వల్ల జరిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. పక్షోత్సవాల్లో అంగన్వాడీ సిబ్బందితో పాటు వైద్యారోగ్య, ఆర్డ్‌బ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారు.
ఆరోగ్యం పరిశీలన, సూచనలు
పోషణ పక్షోత్సవాల్లో గర్భిణులు, చిన్నారుల బరువు, ఆరోగ్యాలను పరిశీలిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యత, పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్‌ను పరిశీలిస్తున్నారు. గర్భిణుల సంరక్షణలో భర్తల పాత్రపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2060 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏడాదిలోపు చిన్నారులు 49,627 మంది, ఆరేళ్ల లోపు చిన్నారులు 13,012 మంది, గర్భిణులు 6,337 మంది, బాలింతలు 6,336 మంది ఉన్నారు. కాగా పోషకాహారం లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. సీమంతం, అన్నప్రాసన, అక్షరభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీని ద్వారా గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించవచ్చు. రక్తహీనత వంటి సమస్యలు రాకుండా చూడొచ్చు. –స్వర్ణలత లెనినా, జిల్లా సీ్త్ర,
శిశు సంక్షేమశాఖ అధికారి

పోషకాహారంతోనే ఆరోగ్యం