
మూడేళ్లు కష్టపడితే భవిష్యత్ మీదే..
● విద్యార్థులకు కలెక్టర్ సూచన ● లక్ష్మీదేవిపల్లి డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
పాల్వంచరూరల్ : డిగ్రీ విద్యార్థులు మూడేళ్లు కష్టపడి చదివితే ఆ తర్వాత భవిష్యత్ బాగుంటుందని, జీవితాంతం సుఖపడే అవకాశం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని చెప్పారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ అటాన్‌మస్ కళాశాలలో బుధవారం ఆయన ప్రథమ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారని, తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. అంతేకాక విశాలమైన తరగతి గదులు, క్రీడామైదానంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పైనా ఆసక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఆటలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతాయన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.పద్మ మాట్లాడుతూ.. కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత తొలిసారిగా పరీక్షలు నిర్వహించి సకాలంలో మూల్యాంకనం చేసి కలెక్టర్ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ పాటిల్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ ఫ్రొఫెసర్ వై.చిన్నప్పయ్య, అటాన్‌మస్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వేముల కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాధవి, అధ్యాపకులు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ కొండలరావు, విజయప్రసాద్, శెట్టి స్వరూపరాణి, పి.శ్రీనివాసరావు, శ్రీదేవి, లీల, దీపిక, విమల, కావ్య, కరీమాపర్వీన్, హారిక, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.