
బూడిదే మిగులుతోంది!
● ఏటా ఏజెన్సీలో అగ్ని ప్రమాదాలతో తీవ్ర నష్టం ● ఇళ్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగులుతున్న బాధితులు ● అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్యం ● చర్ల, గుండాల, ములకలపల్లిలో ఏర్పాటు చేయాలని విన్నపం
చర్ల: ఏజెన్సీలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సుదూర ప్రాంతాల్లోని కేంద్రాల నుంచి ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లోని చర్ల, వెంకటాపురం, వాజేడు, ములకలపల్లి, దమ్మపేట, గుండాల, ఆళ్లపల్లి మండలాలు అగ్నిమాపక కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. ఆయా మండలాల్లో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలల్లో తీవ్రమైన ఆస్తినష్టం సంభవిస్తోంది.
ఫైరింజన్లు వచ్చేసరికి నష్టం జరిగిపోతోంది..
భద్రాచలం నియోజకవర్గం కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి దుమ్ముగూడెం 20 కిలోమీటర్లు, చర్ల 55 కిలోమీటర్ల దూరంలో ఉండగా, వెంకటాపురం 110, వాజేడు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పినపాక మండలంలో ఉన్న గుండాల, ఆళ్లపల్లి మండలాలకు కొత్తగూడెం అగ్నిమాపక కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, దమ్మపేట మండలాలు కొత్తగూడెంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అంత దూరం నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పేందుకు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతోంది. రహదార్లు సరిగా లేని ప్రాంతాలకు ఇంకా ఆలస్యం అవుతోంది. ఆలోపే అంతా అగ్గికి బుగ్గి అవుతోంది. దీంతో బాధితులు కట్టుబట్టలతో మిగులుతున్నారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. వేసవిలో ఇళ్లతోపాటు ధాన్యం కుప్పలు, మిర్చి కల్లాలు, పత్తి కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా అగ్ని ప్రమాదాలతో సుమారు రూ.10 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
అగ్ని ప్రమాదాల నుంచి ఏజెన్సీలో ఆస్తులను కాపాడేందుకు అగ్ని మాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేవలం జిల్లా, నియోజకవర్గ కేంద్రాలను తప్ప ఏజెన్సీలోని మండలాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో మాత్రమే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాలను గాలికొదిలేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం ప్రాంతాలను కూడా పట్టించుకోవడంలేదు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న ములకలపల్లి, దమ్మపేట మండలాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏజెన్సీలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
కాలి బూడిదవుతున్నాయి..
ఏటా చర్ల మండలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తులన్నీ కాలిబూడిదవుతున్నాయి. భద్రాచలం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే సరికి బూడిద మాత్రమే మిగులుతోంది. ప్రభుత్వం స్పందించి చర్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి.
–పి.సాంబశివరావు, ఆర్.కొత్తగూడెం
ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి
చర్ల మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా అగ్ని ప్రమాదాల్లో రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. వందల సంఖ్యలో పేదలు, గిరిజనులు నిరాశ్రయులవుతున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించాలి.
–సాయికుమార్, తేగడ
ప్రతిపాదనలు పంపాం
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అదనంగా అగ్నిమాపక కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నియోజకవర్గ కేంద్రాలకు సుదూర ప్రాంతంలో ఉన్న చర్ల, గుండాల మండల కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నాం. త్వరలోనే మంజూరవుతాయి.
–ఎం.క్రాంతి కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి

బూడిదే మిగులుతోంది!

బూడిదే మిగులుతోంది!

బూడిదే మిగులుతోంది!