
గోదావరిలో మునిగి బాలుడి మృతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని ముదిరాజ్ బజార్‌కు చెందిన కొమ్ము దుర్గ కుమారుడు హర్షవర్దన్ (15), శనివారం మధ్యాహ్నం అదే కాలనీకి చెందిన ఓ మహిళ బట్టలు ఉతికేందుకు వెళ్తుండగా, ఆమెతోపాటు గోదావరికి వెళ్లాడు. హర్షవర్ధన్ నీళ్లలో ఆడుకుంటూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. అక్కడున్నవారి సమాచారంతో వచ్చిన గజ ఈతగాడు గోదావరిలో వెతికి బాలుడిని బయటకు తీశాడు. కుటుంబ సభ్యులు బాలుడికి సీపీఆర్ చేసి, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా సాయంత్రం మృతి చెందాడు. హర్షవర్దన్ బాల్యంలోనే తండ్రి మృతి చెందగా, తల్లి దుర్గ కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని సాకుతోంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాల వాహనం ఢీకొని వృద్ధుడు..
పినపాక: పాల వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు (60) తెల్లవారుజామున ఈ.బయ్యారం క్రాస్ రోడ్‌కు వస్తన్నాడు. ఈ క్రమంలో మణుగూరు నుంచి పాలతో రాజపేట వెళ్తున్న వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజ్ కుమార్ తెలిపారు.