
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
మణుగూరు టౌన్: మండలంలోని సమితిసింగారం గ్రామంలో ఆరబెట్టి ధాన్యం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయింది. దీంతో సోమవారం ఉదయం ధాన్యాన్ని చూసిన రైతులు కన్నీరుమున్నీరయ్యారు. సుమారు 80 ఎకరాల రైతులు లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద పట్టాలు వేసి వడ్లు ఎండబోశారు. పది రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా గన్నీ సంచులు లేవంటూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వస్తుందని సొసైటీలో విక్రయించేందుకు వేచి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం తడిసిందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా సొసైటీలో కొనాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిని వివరణ కోరగా.. నాలుగు రోజుల క్రితం కేంద్రం ప్రారంభించామని, గన్నీ బ్యాగులు లేకపోవడంతో కొనుగోళ్లు చేపట్టలేదని, మంగళవారం నుంచి కొంటామని తెలిపారు.
ఆవేదన చెందుతున్న రైతులు