డిసెంబర్‌లో మరో 10 కంపెనీలు
రూ. 20,000 కోట్ల సమీకరణకు సై
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతూనే ఉన్నాయి. వచ్చే నెల(డిసెంబర్)లో 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఈ జాబితాలో సూపర్‌మార్ట్ దిగ్గజం విశాల్ మెగా మార్ట్‌తోపాటు.. బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్‌స్టిట్యూట్(ఇండియా), విద్యారుణాలందించే ఎన్‌బీఎఫ్‌సీ అవాన్సే ఫైనాన్షియల్ సరీ్వసెస్, టీపీజీ క్యాపిటల్ సంస్థ సాయి లైఫ్ సైన్సెస్, ఆసుపత్రుల చైన్ పారస్ హెల్త్‌కేర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా, ప్యాకేజింగ్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీ మమతా మెషినరీ, ట్రాన్స్‌రైల్ లైటింగ్ ఉన్నాయి.
వివిధ రంగాలు, విభిన్న పరిమాణంలో కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంటుకు తెరతీయనున్నట్లు ఆన్‌లైన్ బ్రోకరేజీ ట్రేడ్‌జినీ సీవోవో త్రివేష్.డి. అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైమరీ మార్కెట్ మరింత కళకళలాడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది(2024) ఐపీవోలకు అత్యంత ప్రోత్సాహకరంగా సాగినప్పటికీ ఇటీవల కొంతమేర ప్రతికూల ధోరణి నెలకొన్నట్లు తెలియజేశారు.
ఇష్యూల వివరాలు
విశాల్ మెగా మార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్ సమయత్ సరీ్వసెస్ ఎల్‌ఎల్‌పీ వాటాను విక్రయించనుంది. ఇక జెమ్మలాజికల్ ఇన్‌స్టిట్యూట్ రూ. 4,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. దీనిలో భాగంగా రూ. 1,250 కోట్లు తాజా ఈక్విటీ జారీసహా.. రూ. 2,750 కోట్ల విలువైన షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ, ప్రమోటర్ బీసీపీ ఏషియా–2 టాప్‌కో పీటీఈ ఆఫర్ చేయనుంది. కాగా.. వార్‌బర్గ్ పింకస్ సంస్థ ఒలివ్ వైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోట్ చేసిన అవాన్సే ఫైనాన్షియల్ రూ. 3,500 కోట్లు సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా రూ. 1,000 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్ల విక్రయం ద్వారా రూ. 2,500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ నిధులను మూలధన పటిష్టతకు వెచి్చంచనుంది.
రికార్డ్ సమీకరణ
ఈ ఏడాది ఇప్పటికే 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఇది రికార్డ్ కాగా.. జాబితాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై), ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా గతేడాది(2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి. సుమారు 236 కంపెనీలు 2021–25 మధ్య కాలంలో ఐపీవోలకు వచ్చాయి. సగటున 27 శాతం లిస్టింగ్ లాభాలను అందించడం గమనార్హం.
సురక్ష: రూ. 420–441
సమీకృత డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(29న) ప్రారంభంకానుంది. డిసెంబర్ 3న ముగియనున్న ఇష్యూకి రూ. 420–441 ధరల శ్రేణిని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1,91,89,330 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 846 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే ఈక్విటీ జారీ లేనందున ఇష్యూ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు.
Comments
Please login to add a commentAdd a comment