ముంబై, సాక్షి: గతేడాది జోష్‌ను కొనసాగిస్తూ 2021లోనూ దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ట రికార్డులను సాధిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. కోవిడ్-19 సంక్షోభం తలెత్తినప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో ప్రైమరీ మార్కెట్ పలు ఇష్యూలతో కళకళాడింది. ప్రధానంగా గతేడాది లిస్టయిన పలు కంపెనీల షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతానికి 15కుపైగా కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. ఈ నెల(జనవరి)లో కనీసం 6 కంపెనీలు మార్కెట్లను తాకనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది మార్చిలో కోవిడ్-19 దెబ్బకు మార్కెట్లు పతనమైనప్పటికీ ద్వితీయార్థంలో వేగంగా పుంజుకున్నాయి. దీంతో అత్యధిక శాతం కంపెనీలు ద్వితీయార్థంలోనే పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి గతేడాది ప్రైమరీ మార్కెట్ ద్వారా 16 కంపెనీలు రూ. 31,000 కోట్లను సమీకరించగలిగాయి.
జాబితా తీరిలా
ఈ ఏడాది సైతం మార్కెట్లు ర్యాలీ బాటలోసాగే వీలున్నట్లు నిపుణలు భావిస్తున్నారు. దీంతో 2021లోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో పీఎస్‌యూలు, ప్రయివేట్ రంగ సంస్థలున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బ్యాంక్(ఐఆర్‌ఎఫ్‌సీ), కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్‌ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండిగో పెయింట్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రైల్‌టెల్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. వీటితోపాటు.. క్రాఫ్ట్స్‌మన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, సంహీ హోటల్స్, శ్యామ్ స్టీల్ తదితర పలు కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు దిగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ నెలలోనే
జనవరిలో ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, ఐఆర్‌ఎఫ్‌సీ, బ్రూక్‌ఫీల్డ్ ఆర్‌ఈఐటీ, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఐపీవో ద్వారా ఐఆర్‌ఎఫ్‌సీ రూ. 4,600 కోట్లు, కళ్యాణ్ జ్యువెలర్స్ రూ. 1,700 కోట్లు, ఈఎస్‌ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,000 కోట్లు, ఇండిగో పెయింట్స్ రూ. 1,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ రూ. 4,000-4,500 కోట్లు, బార్బిక్యు నేషన్ రూ. 1,000-1200 కోట్లు, ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 1,000 కోట్లు, హోమ్ ఫస్ట్ కంపెనీ రూ. 1,500 కోట్లు, సంహీ హోటల్స్ రూ. 2,000 కోట్లు చొప్పున నిధుల సమీకరణ చేపట్టే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
వీటితో జోష్
గతేడాది ఐపీవోలు చేపట్టాక పలు కంపెనీలు లిస్టింగ్‌లో భారీ లాభాలు ఆర్జించాయి. లిస్టింగ్ తదుపరి బర్గర్ కింగ్, హ్యాపీయెస్ట్ మైండ్స్, బెక్టర్స్ ఫుడ్, రోజారీ బయోటెక్, రూట్ మొబైల్ 100-200 శాతం స్థాయిలో జంప్ చేశాయి. ఈ బాటలో కెమ్‌కాన్ స్పెషాలిటీ, కంప్యూటర్ ఏజ్, గ్లాండ్ ఫార్మా, మజగావ్ డాక్ సైతం రెండంకెల లాభాలు ఆర్జించాయి. దీంతో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment