IPO Street
-
2021లో 15 ఐపీవోలు- ఈ నెలలోనే 6
ముంబై, సాక్షి: గతేడాది జోష్‌ను కొనసాగిస్తూ 2021లోనూ దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ట రికార్డులను సాధిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. కోవిడ్-19 సంక్షోభం తలెత్తినప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో ప్రైమరీ మార్కెట్ పలు ఇష్యూలతో కళకళాడింది. ప్రధానంగా గతేడాది లిస్టయిన పలు కంపెనీల షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతానికి 15కుపైగా కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. ఈ నెల(జనవరి)లో కనీసం 6 కంపెనీలు మార్కెట్లను తాకనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది మార్చిలో కోవిడ్-19 దెబ్బకు మార్కెట్లు పతనమైనప్పటికీ ద్వితీయార్థంలో వేగంగా పుంజుకున్నాయి. దీంతో అత్యధిక శాతం కంపెనీలు ద్వితీయార్థంలోనే పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి గతేడాది ప్రైమరీ మార్కెట్ ద్వారా 16 కంపెనీలు రూ. 31,000 కోట్లను సమీకరించగలిగాయి. జాబితా తీరిలా ఈ ఏడాది సైతం మార్కెట్లు ర్యాలీ బాటలోసాగే వీలున్నట్లు నిపుణలు భావిస్తున్నారు. దీంతో 2021లోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో పీఎస్‌యూలు, ప్రయివేట్ రంగ సంస్థలున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బ్యాంక్(ఐఆర్ఎఫ్సీ), కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండిగో పెయింట్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రైల్‌టెల్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. వీటితోపాటు.. క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, సంహీ హోటల్స్, శ్యామ్ స్టీల్ తదితర పలు కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెలలోనే జనవరిలో ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, ఐఆర్ఎఫ్సీ, బ్రూక్‌ఫీల్డ్ ఆర్ఈఐటీ, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఐపీవో ద్వారా ఐఆర్ఎఫ్సీ రూ. 4,600 కోట్లు, కళ్యాణ్ జ్యువెలర్స్ రూ. 1,700 కోట్లు, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,000 కోట్లు, ఇండిగో పెయింట్స్ రూ. 1,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ రూ. 4,000-4,500 కోట్లు, బార్బిక్యు నేషన్ రూ. 1,000-1200 కోట్లు, ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 1,000 కోట్లు, హోమ్ ఫస్ట్ కంపెనీ రూ. 1,500 కోట్లు, సంహీ హోటల్స్ రూ. 2,000 కోట్లు చొప్పున నిధుల సమీకరణ చేపట్టే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితో జోష్ గతేడాది ఐపీవోలు చేపట్టాక పలు కంపెనీలు లిస్టింగ్‌లో భారీ లాభాలు ఆర్జించాయి. లిస్టింగ్ తదుపరి బర్గర్ కింగ్, హ్యాపీయెస్ట్ మైండ్స్, బెక్టర్స్ ఫుడ్, రోజారీ బయోటెక్, రూట్ మొబైల్ 100-200 శాతం స్థాయిలో జంప్ చేశాయి. ఈ బాటలో కెమ్‌కాన్ స్పెషాలిటీ, కంప్యూటర్ ఏజ్, గ్లాండ్ ఫార్మా, మజగావ్ డాక్ సైతం రెండంకెల లాభాలు ఆర్జించాయి. దీంతో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
ఐపీవో స్ట్రీట్: మజగాన్ డాక్, యూటీఐ ఏఎంసీ
ప్రభుత్వ రంగ దిగ్గజం మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 135-145. ఐపీవోలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15.17 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.06 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వం రూ. 444 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రక్షణ రంగానికి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులకు 3.45 లక్షల షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. కంపెనీ వివరాలు రక్షణ రంగ పీఎస్‌యూ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్.. 40,000 డీడబ్ల్యూటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. తద్వారా ఓడలు, సబ్మెరైన్లను రూపొందిస్తోంది. రక్షణ శాఖకు అవసరమయ్యే యుద్ధనౌకల తయారీ, మరమ్మతులను చేపడుతోంది. వాణిజ్య ప్రాతిపదికన ఇతర క్లయింట్లకు వెస్సల్స్‌ను తయారు చేస్తోంది. 2006లో కంపెనీ మినీరత్న హోదాను పొందింది. కంపెనీ రుణరహితంకావడంతోపాటు.. ముంబై తీరంలో ఉండటంతో అధిక అవకాశాలు పొందుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్డర్లను త్వరగా పూర్తిచేయగలగడం, తద్వారా వేగంగా క్యాష్‌ఫ్లోను సాధించగలగడం వంటి అంశాలు కంపెనీ భవిష్యత్‌పై ప్రభావం చూపే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రక్షణ రంగ బడ్జెట్ ఆలస్యంకావడం లేదా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడటం ద్వారా వ్యయాలు పెరగడం వంటి ప్రతికూలతలు ఎదురుకావచ్చని తెలియజేశారు. యూటీఐ ఏఎంసీ నిర్వహణలోని ఆస్తుల రీత్యా దేశంలోనే రెండో పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. యూటీఐ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 552-554. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ, ఎల్ఐసీ, బీవోబీ, పీఎన్బీ, టీ రోవ్ ప్రైస్ ఇంటర్నేషనల్ వాటాలు విక్రయించనున్నాయి. మొత్తం 3.9 కోట్ల షేర్లవరకూ ఆఫర్ చేస్తున్నాయి. ఇది కంపెనీ ఈక్విటీలో 30.75 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 2,160 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. అర్హతగల ఉద్యోగులకు 2 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. కంపెనీ వివరాలు యూటీఐ ఏఎంసీలో ప్రస్తుతం ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ 18.24 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. టీ రోవ్ ప్రైస్‌కు 26 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఐపీవో ద్వారా ఎస్బీఐ, బీవోబీ, ఎల్ఐసీ 8.25 శాతం, టీ రోవ్, పీఎన్బీ 3 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. 2019లో ఈపీఎఫ్‌వో నిధులలో 55 శాతం నిర్వహణకు యూటీఐ ఏఎంసీ అనుమతిని పొందింది. గత కొన్నేళ్లుగా యూటీఐ ఏఎంసీ ఉత్తమ రిటర్నులు, మార్జిన్లను సాధిస్తున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ నిపుణులు నిరాలీ షా పేర్కొన్నారు. మార్కెట్ క్యాప్ టు ఈక్విటీ QAAUM ప్రకారం చూస్తే 18 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. ప్రస్తుత ఐపీవో ధర కంటే చౌకగా ఈ ఏడాది కంపెనీ ఉద్యోగులకు షేరుకి రూ. 728 ధరలో వాటాలను కేటాయించినట్లు తెలియజేశారు. -
రెండు దశాబ్దాలలో.. రికార్డ్ లిస్టింగ్స్
పబ్లిక్ ఇష్యూ ధర రూ. 116 కాగా.. గురువారం(17న) రూ. 351 వద్ద లిస్ట్‌కావడం ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. దశాబ్ద కాలంలో ఇది(111 శాతం) అత్యధిక లాభంకాగా.. ఇంతక్రితం డీమార్ట్ రిటైల్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ 102 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు రెట్టింపు సంపదను పంచిన కంపెనీలలో డీమార్ట్ రెండో ర్యాంకుకు చేరింది. ఐటీ రంగ దిగ్గజం అశోక్ సూతా ప్రమోట్ చేసిన హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో 151 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ కావడం ద్వారా కూడా రికార్డును సాధించిన విషయం తెలిసిందే. కాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో భారీ ప్రీమియంతో లిస్టయిన జాబితాను పరిగణిస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ మూడో కంపెనీగా నిలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 100 కోట్లకుపైగా నిధులను సమీకరించిన కంపెనీలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదిక వివరాలు చూద్దాం... టాప్-5 2017 మార్చిలో వచ్చిన డీమార్ట్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 299కాగా.. 102 శాతం ప్రీమియంతో రూ. 604 వద్ద లిస్టయ్యింది. ఇదే విధంగా 2019 అక్టోబర్‌లో రూ. 320 ధరలో ఐపీవోకి వచ్చిన పీఎస్‌యూ.. ఐఆర్సీటీసీ కౌంటర్లో రూ. 644 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 101 శాతం లాభంకాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే.. 150 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా ఇంద్రప్రస్థ గ్యాస్ కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఐపీవో ధర రూ. 48తో పోలిస్తే తొలి రోజు రూ. 120 వద్ద నమోదైంది. ఈ బాటలో టీవీ టుడే నెట్వర్క్ రూ. 95 ధరలో ఐపీవో చేపట్టగా.. 121 శాతం లాభంతో రూ. 210 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ ప్రారంభమైంది. జాబితాలో గత రెండు దశాబ్దాల కాలంలో పబ్లిక్ ఇష్యూ ముగిశాక భారీ లాభాలతో లిస్టింగ్ సాధించిన కంపెనీల జాబితాను చూద్దాం.. పార్శ్వనాథ్ డెవలపర్స్ ఇష్యూ ధర రూ. 300 కాగా.. 80 శాతం లాభంతో రూ. 540 వద్ద లిస్టయ్యింది. అదానీ పోర్ట్స్ రూ. 440 ధరలో ఐపీవోకిరాగా.. రూ. 770 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇది 75 శాతం ప్రీమియం. ఇక ఎడిల్వీజ్, మేఘమణి ఆర్గానిక్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, వీ2 రిటైల్, అపోలో మైక్రోసిస్టమ్స్, శోభా లిమిటెడ్ సైతం సుమారు 75 శాతం లాభాలతో లిస్ట్‌కావడం విశేషం! ఈ కాలంలో 20 వరకూ ఐపీవోలకు 100 రెట్లు అధికంగా స్పందన లభించినప్పటికీ లిస్టింగ్‌లో లాభాలు సగటున 70 శాతానికే పరిమితమైనట్లు నిపుణులు తెలియజేశారు. -
క్యామ్స్- కెమ్‌కాన్ స్పెషాలిటీ.. ఐపీవోలకు రెడీ
గత వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో ఏకంగా 151 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. రూట్ మొబైల్ ఇష్యూకి సైతం 73 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఈ బాటలో తాజాగా కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(సీఏఎంఎస్- క్యామ్స్), కెమ్‌కాన్ స్పెషాలిటీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. వివరాలు చూద్దాం.. క్యామ్స్(CAMS) లిమిటెడ్ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని క్యామ్స్ ప్రకటించింది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)కి అనుబంధ విభాగమైన క్యామ్స్.. మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ తయారు చేసే హెచ్ఎండీఎస్, సీఎంఐసీ తదితర స్పెషాలిటీ కెమికల్స్‌ను ప్రధానంగా ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. ఐపీవో నిధులను విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. దేశీయంగా హెటెరో, లారస్ ల్యాబ్స్‌తోపాటు.. అరబిందో, ల్యాన్టెక్ తదితర ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తోంది. యూఎస్, జపాన్, చైనా తదితర దేశాలకూ ఎగుమతులు చేపడుతోంది. -
రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ 9న
ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 9న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. ఇష్యూ 11న(శుక్రవారం) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్ కుమార్ గుప్తా, రాజ్‌దీప్ కుమార్ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్ మొబైల్ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. లాట్ 40 షేర్లు రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూకి రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్ దాఖలు చేయవచ్చు. రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. -
7 నుంచీ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో
డిజిటల్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సేవలందించే హ్యాపీయెస్ట్ మైండ్స్ పబ్లిక్ ఇష్యూ సోమవారం(7న) ప్రారంభంకానుంది. బుధవారం(9న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 165-166కాగా.. రూ. 702 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేరు ముఖ విలువ రూ. 2కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో లాట్ 90 షేర్లుగా నిర్ణయించారు. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షలకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా 3.57 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. అంతేకాకుండా మరో రూ. 110 కోట్ల విలువైన షేర్లను సైతం తాజాగా జారీ చేయనుంది. కంపెనీ తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన జేపీ మోర్గాన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన సీఎండీబీ-2 తమకున్న 19.4 శాతం వాటా(2.72 కోట్ల షేర్లకుపైగా) విక్రయించనుంది. ప్రమోటర్ అశోక్ సూతా 84.14 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఐటీ సర్వీసుల రంగం నుంచి ఇంతక్రితం 2016లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా హ్యాపీయెస్ట్ మైండ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 316 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 166 ధరలో 1.9 కోట్ల షేర్లను జారీ చేసింది. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ పీటీఈ, ఎవెండస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్ తదితర 25 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. బ్యాక్‌గ్రౌండ్.. దేశీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్ సూతా 2011లో హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలలో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్ మైండ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. కాగా.. కంపెనీ షేర్లకు అనధికార(గ్రే) మార్కెట్లో 50 శాతం ప్రీమియం పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
రోజారీ బయోటెక్ బంపర్ లిస్టింగ్
కోవిడ్-19 అనిశ్చితుల నేపథ్యంలోనూ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్చేంజీలలో భారీ ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 425కాగా.. ఎన్ఎస్ఈలో రూ. 244 లాభంతో రూ. 669 వద్ద లిస్టయ్యింది. తదుపరి రూ. 695 వరకూ జంప్‌చేసింది. ఇది 63 శాతం లాభంకాగా.. రూ. 664 వద్ద కనిష్టాన్ని చేరింది. ప్రస్తుతం రూ. 680 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 15న ముగిసిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 496 కోట్లు సమీకరించింది. ఇష్యూ 79 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్కావడం విశేషం! కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
ఇండిగో.. టేకాఫ్!
ఐపీఓ స్ట్రీట్ ‘ రూ.3,000 కోట్లు - సెబీకి ఐపీఓ పత్రాలు దాఖలు చేసిన ఇండిగో, ఇన్ఫీబీమ్ - ఇదే బాటలో టీమ్‌లీజ్ కూడా.. న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఐపీఓల మళ్లీ పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)ల హడావుడి మొదలైంది. ఒకేరోజు దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ఐపీఓలకు రెండు కంపెనీలు సెబీ వద్ద మంగళవారం దరఖాస్తు(డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్) చేసుకున్నాయి. చౌక ధరల విమానయాన కంపెనీ ఇండిగో ఎయిర్‌లైన్స్, ఈ-కామర్స్ కంపెనీ ఇన్ఫీబీమ్ ఈ జాబితాలో ఉన్నాయి. మానవవనరుల(హెచ్ఆర్) కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ కూడా ఐపీఓ దరఖాస్తు బాటలో ఉన్నట్లు సమాచారం. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ ప్రతిపాదిత రూ.400 కోట్ల ఐపీఓకి సెబీ ఆమోదం లభించింది. ఇటీవల ఐపీఓ నిబంధనల్లో సెబీ తీసుకొచ్చిన సంస్కరణలు, మార్కెట్లలో కొంత స్థిరీకరణ వంటి కారణాల నేపథ్యంలో కంపెనీలు స్టాక్ మార్కెట్లో నిధుల వేటకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. 30 కంపెనీలు సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ఐపీఓ ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే 20 కంపెనీలకు సెబీ ఆమోదం లభించింది. 2015లో ఇప్పటివరకూ 8 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాయి. 2014లో కేవలం 6 కంపెనీలు(రూ.1,528 కోట్లు) మాత్రమే ఐపీఓలకు రావడం విశేషం. ఇండిగో.. రూ.2,500 కోట్లు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ నడుపుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్... మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద దేశీ ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తోంది. ఐపీఓ ద్వారా దాదాపు రూ.2,000,-2,500 కోట్ల మేరకు నిధులను సమీకరించాలనేది కంపెనీ ప్రణాళిక. ఐపీఓలో రూ. 1,272 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుత వాటాదార్లు కూడా 3.01 కోట్ల వరకూ షేర్ల విక్రయం ద్వారా ఇంతే మొత్తాన్ని సమీకరించే అవకాశం ఉంది. - 2006లో ట్రావెల్ ఎంట్రప్రెన్యూర్ రాహుల్ భాటియా, యూఎస్ ఎయిర్వేస్ మాజీ సీఈఓ రాకేశ్ గంగ్వాల్లు కలిసి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. - సిడ్నీకి చెందిన ఒక విమానయానరంగ విశ్లేషణ సంస్థ(సీఏపీఏ) నివేదిక ప్రకారం ఇండిగో లాభం గతేడాది(2014-15) 15-17.5 కోట్ల డాలర్లు(రూ.960-1,120 కోట్లు)గా అంచనా. - ఈ ఏడాది మే నెలలో ఇండిగోలో 27.69 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం దేశీ విమానయాన కంపెనీల్లో ప్రయాణించిన వారి సంఖ్య ఇదే నెలలో 71.27 లక్షలుగా నమోదైంది. - ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్, స్రైస్జెట్ మాత్రమే భారత్ స్టాక్మార్కెట్లో లిస్టయి ఉన్నాయి.(కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు ట్రేడ్ కావడం లేదు) - దేశీ ఎయిర్‌లైన్స్‌లో లాభాల్లో నడుస్తున్నవి ఇండిగో, గో ఎయిర్ మాత్రమే కావడం విశేషం. తొలి ఈ-కామర్స్ ఐపీఓ... దేశంలో తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి రానున్న ఈ-కామర్స్ కంపెనీగా గుజరాత్‌కు చెందిన ఇన్ఫీబీమ్ ఇన్కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డు సృష్టించనుంది. సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఈ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ దాదాపు రూ.450 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. 2007లో ఆరంభమైన ఈ సంస్థ ఇన్ఫీబీమ్.కామ్‌తో పాటు ఇండెంట్, బిల్డ్బజార్, ఇన్‌సెప్ట్, పిక్స్క్వేర్ వంటి పోర్టల్స్‌ను నిర్వహిస్తోంది. గతేడాది ఇండెంట్లో సోనీ మ్యూజిక్ 26% వాటా కూడా తీసుకుంది. ప్రస్తుతం దేశంలో టాప్-3 ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌లతో ఇన్ఫీబీమ్ పోటీపడుతోంది.