గత వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో ఏకంగా 151 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా.. రూట్ మొబైల్ ఇష్యూకి సైతం 73 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఈ బాటలో తాజాగా కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్(సీఏఎంఎస్- క్యామ్స్), కెమ్‌కాన్ స్పెషాలిటీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. వివరాలు చూద్దాం..
క్యామ్స్(CAMS) లిమిటెడ్
ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని క్యామ్స్ ప్రకటించింది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)కి అనుబంధ విభాగమైన క్యామ్స్.. మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది.
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీవోలో భాగంగా శుక్రవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులు సమీకరించనుంది.
కంపెనీ బ్యాక్‌గ్రౌండ్
కెమ్‌కాన్ తయారు చేసే హెచ్‌ఎండీఎస్, సీఎంఐసీ తదితర స్పెషాలిటీ కెమికల్స్‌ను ప్రధానంగా ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. ఐపీవో నిధులను విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. దేశీయంగా హెటెరో, లారస్ ల్యాబ్స్‌తోపాటు.. అరబిందో, ల్యాన్‌టెక్ తదితర ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తోంది. యూఎస్, జపాన్, చైనా తదితర దేశాలకూ ఎగుమతులు చేపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment