ఇండిగో.. టేకాఫ్! | IndiGo files papers with Sebi | Sakshi
Sakshi News home page

ఇండిగో.. టేకాఫ్!

Published Wed, Jul 1 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

ఇండిగో.. టేకాఫ్!

ఇండిగో.. టేకాఫ్!

ఐపీఓ స్ట్రీట్ ‘ రూ.3,000 కోట్లు
- సెబీకి ఐపీఓ పత్రాలు దాఖలు చేసిన ఇండిగో, ఇన్ఫీబీమ్
- ఇదే బాటలో టీమ్‌లీజ్ కూడా..
న్యూఢిల్లీ:
స్టాక్ మార్కెట్లో ఐపీఓల మళ్లీ పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)ల హడావుడి మొదలైంది. ఒకేరోజు దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ఐపీఓలకు రెండు కంపెనీలు సెబీ వద్ద మంగళవారం దరఖాస్తు(డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్) చేసుకున్నాయి. చౌక ధరల విమానయాన కంపెనీ ఇండిగో ఎయిర్‌లైన్స్, ఈ-కామర్స్ కంపెనీ ఇన్ఫీబీమ్ ఈ జాబితాలో ఉన్నాయి. మానవవనరుల(హెచ్‌ఆర్) కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ కూడా ఐపీఓ దరఖాస్తు బాటలో ఉన్నట్లు సమాచారం. క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ ప్రతిపాదిత రూ.400 కోట్ల ఐపీఓకి  సెబీ  ఆమోదం లభించింది.

ఇటీవల ఐపీఓ నిబంధనల్లో సెబీ తీసుకొచ్చిన సంస్కరణలు, మార్కెట్లలో కొంత స్థిరీకరణ వంటి కారణాల నేపథ్యంలో  కంపెనీలు స్టాక్ మార్కెట్లో నిధుల వేటకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.  30 కంపెనీలు సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ఐపీఓ ప్రణాళికల్లో ఉన్నాయి.  ఇప్పటికే 20 కంపెనీలకు సెబీ ఆమోదం లభించింది.  2015లో ఇప్పటివరకూ 8 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాయి. 2014లో కేవలం 6 కంపెనీలు(రూ.1,528 కోట్లు) మాత్రమే ఐపీఓలకు రావడం విశేషం.
 
ఇండిగో.. రూ.2,500 కోట్లు
ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ నడుపుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్... మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద దేశీ ఎయిర్‌లైన్స్‌గా నిలుస్తోంది.  ఐపీఓ ద్వారా దాదాపు రూ.2,000,-2,500 కోట్ల మేరకు నిధులను సమీకరించాలనేది కంపెనీ ప్రణాళిక. ఐపీఓలో రూ. 1,272 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుత వాటాదార్లు కూడా 3.01 కోట్ల వరకూ షేర్ల విక్రయం ద్వారా ఇంతే మొత్తాన్ని సమీకరించే అవకాశం ఉంది.
- 2006లో ట్రావెల్ ఎంట్రప్రెన్యూర్ రాహుల్ భాటియా, యూఎస్ ఎయిర్‌వేస్ మాజీ సీఈఓ రాకేశ్ గంగ్వాల్‌లు కలిసి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు.
- సిడ్నీకి చెందిన ఒక విమానయానరంగ విశ్లేషణ సంస్థ(సీఏపీఏ) నివేదిక ప్రకారం ఇండిగో లాభం గతేడాది(2014-15) 15-17.5 కోట్ల డాలర్లు(రూ.960-1,120 కోట్లు)గా అంచనా.
- ఈ ఏడాది మే నెలలో ఇండిగోలో 27.69 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం దేశీ విమానయాన కంపెనీల్లో ప్రయాణించిన వారి సంఖ్య ఇదే నెలలో 71.27 లక్షలుగా నమోదైంది.
- ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్, స్రైస్‌జెట్ మాత్రమే భారత్ స్టాక్‌మార్కెట్లో లిస్టయి ఉన్నాయి.(కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు ట్రేడ్ కావడం లేదు)
- దేశీ ఎయిర్‌లైన్స్‌లో లాభాల్లో నడుస్తున్నవి  ఇండిగో, గో ఎయిర్ మాత్రమే కావడం విశేషం.
 
తొలి ఈ-కామర్స్ ఐపీఓ...
దేశంలో తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి రానున్న ఈ-కామర్స్ కంపెనీగా గుజరాత్‌కు చెందిన ఇన్ఫీబీమ్ ఇన్‌కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డు సృష్టించనుంది. సెబీకి దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఈ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ దాదాపు రూ.450 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. 2007లో ఆరంభమైన ఈ సంస్థ ఇన్ఫీబీమ్.కామ్‌తో పాటు ఇండెంట్, బిల్డ్‌బజార్, ఇన్‌సెప్ట్, పిక్‌స్క్వేర్ వంటి పోర్టల్స్‌ను నిర్వహిస్తోంది. గతేడాది ఇండెంట్‌లో సోనీ మ్యూజిక్ 26% వాటా కూడా తీసుకుంది. ప్రస్తుతం దేశంలో టాప్-3 ఈ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌లతో ఇన్ఫీబీమ్ పోటీపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement