కోవిడ్-19 అనిశ్చితుల నేపథ్యంలోనూ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్చేంజీలలో భారీ ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 425కాగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 244 లాభంతో రూ. 669 వద్ద లిస్టయ్యింది. తదుపరి రూ. 695 వరకూ జంప్‌చేసింది. ఇది 63 శాతం లాభంకాగా.. రూ. 664 వద్ద కనిష్టాన్ని చేరింది. ప్రస్తుతం రూ. 680 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 15న ముగిసిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 496 కోట్లు సమీకరించింది. ఇష్యూ 79 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కావడం విశేషం!
కంపెనీ బ్యాక్‌గ్రౌండ్
రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్‌టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్‌టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2020లో ఇలా
గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment