పబ్లిక్ ఇష్యూ ధర రూ. 116 కాగా.. గురువారం(17న) రూ. 351 వద్ద లిస్ట్‌కావడం ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. దశాబ్ద కాలంలో ఇది(111 శాతం) అత్యధిక లాభంకాగా.. ఇంతక్రితం డీమార్ట్ రిటైల్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ 102 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు రెట్టింపు సంపదను పంచిన కంపెనీలలో డీమార్ట్ రెండో ర్యాంకుకు చేరింది. ఐటీ రంగ దిగ్గజం అశోక్ సూతా ప్రమోట్ చేసిన హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో 151 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ కావడం ద్వారా కూడా రికార్డును సాధించిన విషయం తెలిసిందే. కాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో భారీ ప్రీమియంతో లిస్టయిన జాబితాను పరిగణిస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ మూడో కంపెనీగా నిలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 100 కోట్లకుపైగా నిధులను సమీకరించిన కంపెనీలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదిక వివరాలు చూద్దాం...
టాప్-5
2017 మార్చిలో వచ్చిన డీమార్ట్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 299కాగా.. 102 శాతం ప్రీమియంతో రూ. 604 వద్ద లిస్టయ్యింది. ఇదే విధంగా 2019 అక్టోబర్‌లో రూ. 320 ధరలో ఐపీవోకి వచ్చిన పీఎస్‌యూ.. ఐఆర్‌సీటీసీ కౌంటర్లో రూ. 644 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 101 శాతం లాభంకాగా.. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే.. 150 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా ఇంద్రప్రస్థ గ్యాస్ కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఐపీవో ధర రూ. 48తో పోలిస్తే తొలి రోజు రూ. 120 వద్ద నమోదైంది. ఈ బాటలో టీవీ టుడే నెట్‌వర్క్ రూ. 95 ధరలో ఐపీవో చేపట్టగా.. 121 శాతం లాభంతో రూ. 210 వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ ప్రారంభమైంది.
జాబితాలో
గత రెండు దశాబ్దాల కాలంలో పబ్లిక్ ఇష్యూ ముగిశాక భారీ లాభాలతో లిస్టింగ్ సాధించిన కంపెనీల జాబితాను చూద్దాం.. పార్శ్వనాథ్ డెవలపర్స్ ఇష్యూ ధర రూ. 300 కాగా.. 80 శాతం లాభంతో రూ. 540 వద్ద లిస్టయ్యింది. అదానీ పోర్ట్స్ రూ. 440 ధరలో ఐపీవోకిరాగా.. రూ. 770 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇది 75 శాతం ప్రీమియం. ఇక ఎడిల్‌వీజ్, మేఘమణి ఆర్గానిక్స్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, వీ2 రిటైల్, అపోలో మైక్రోసిస్టమ్స్, శోభా లిమిటెడ్ సైతం సుమారు 75 శాతం లాభాలతో లిస్ట్‌కావడం విశేషం! ఈ కాలంలో 20 వరకూ ఐపీవోలకు 100 రెట్లు అధికంగా స్పందన లభించినప్పటికీ లిస్టింగ్‌లో లాభాలు సగటున 70 శాతానికే పరిమితమైనట్లు నిపుణులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment