న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్‌లో భాగంగా మూడో రోజు గురువారాని(24)కల్లా దాదాపు 28 లక్షల ఎన్‌డీటీవీ షేర్లు టెండరయ్యాయి. ఎన్‌డీటీవీ వాటాదారుల నుంచి 1.67 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలుకి అదానీ గ్రూప్ షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. ఆఫర్ డిసెంబర్ 5న ముగియనుంది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఆఫర్‌లో 16.54 శాతానికి సమానమైన 27,72,159 షేర్లు లభించాయి. అయితే గురువారం బీఎస్‌ఈలో ఎన్‌డీటీవీ షేరు ఆఫర్ ధరతో పోలిస్తే 25 శాతం అధికంగా రూ. 368కు ఎగువన ముగియడం గమనార్హం!
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించిన విషయం విదితమే. వెరసి ఎన్‌డీటీవీలో 26 శాతం అదనపు వాటాకు అదానీ గ్రూప్ రూ. 493 కోట్లు వెచ్చించనుంది. దశాబ్దకాలం క్రితం ఎన్‌డీటీవీకి రూ. 400 కోట్ల రుణాలు సమకూర్చిన వీసీపీఎల్ ఇందుకుగాను వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్ ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు నిర్ణయించింది. తద్వారా ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్‌డీటీవీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment