వెహికల్ అంటే.. ఒక్క మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా అని వాహన ప్రియులు తెలుసుకున్నారు. కాబట్టి చాలామంది కార్ల కొనుగోలుదారులు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ కథనంలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.
హ్యుందాయ్ వెర్నా
గత ఏడాది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ వెర్నా.. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. వెర్నా అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 28.18 పాయింట్లు, కిడ్స్ సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్ల స్కోర్ సాధించి.. మొత్తం మీద 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.
రెండు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన హ్యుందాయ్ వెర్నా.. మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏడీఏఎస్ ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 17.42 లక్షల వరకు ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మరో కారు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్. ఇది పిల్లల సేఫ్టీలో 49కి గానూ 42 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 34కి గానూ 29.71 పాయింట్లు స్కోర్ సాధించింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హై-స్పీడ్ వార్ణింగ్, సెన్సార్‌లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ఈ కారు ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 19.41 లక్షల మధ్య ఉన్నాయి.
టాటా నెక్సాన్
సేఫ్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కార్లు. కంపెనీ కారైన నెక్సాన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటి. ఇది కిడ్స్ సేఫ్టీలో 44.52 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 32.22 పాయింట్లు సాధించి.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కారుగా నిలిచింది.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లను కలిగి ఉన్న ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను టాటా నెక్సాన్ కారులో చూడవచ్చు. నెక్సాన్ ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉన్నాయి.
టాటా హారియర్
టాటా కంపెనీకి చెందిన సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది మరో కారు హారియర్. ఇది పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు, పెద్దల రక్షణలో 34కు 33.05 పాయింట్ల స్కోర్ సాధించింది. రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న హారియర్.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.
మహీంద్రా స్కార్పియో ఎన్
రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ధరతో లభించే మహీంద్రా స్కార్పియో గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ సాధించిన అత్యుత్తమ కార్లలో ఒకటి. ఇది అడల్ట్ సేఫ్టీలో 34కు 29.25 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 49కు 28.93 పాయింట్లు సాధించి సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.
మహీంద్రా స్కార్పియో ఎన్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభించే ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: మార్కెట్లో మరో పవర్‌ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఇతర కార్లు
➤స్కోడా స్లావియా
➤టాటా సఫారి
➤స్కోడా కుషాక్
➤ఫోక్స్‌వ్యాగన్ టైగన్
➤టాటా పంచ్
➤మహీంద్రా ఎక్స్‌యూవీ300
➤టాటా ఆల్ట్రోజ్
➤టాటా నెక్సాన్
➤మహీంద్రా ఎక్స్‌యూవీ700
Comments
Please login to add a commentAdd a comment