న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ సర్వీసులకు సంబంధించి 85 శాతం నెట్‌వర్క్‌ను తామే నెలకొల్పామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఊక్లా విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తొలుత చెప్పిన 2023 డిసెంబర్ గడువుకన్నా ముందుగానే దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించగలిగామని అంబానీ తెలిపారు.
"నిబద్ధతతో కూడిన ట్రూ 5జీ రోల్‌అవుట్‌లో మా వేగం గురించి నేను ప్రత్యేకంగా గర్విస్తున్నాను. మేము వాగ్దానం చేసిన 2023 డిసెంబరు కాలపరిమితి కంటే ముందే దేశమంతటా బలమైన ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో కవర్ చేశాం. భారతదేశంలో మొత్తం 5జీ నెట్‌వర్క్‌లో 85 శాతం జియో నెలకొల్పినదే. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్‌ని ఏర్పాటు చేస్తున్నాం" అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
టెలికం శాఖ గణాంకాల ప్రకారం దేశీయంగా 3.38 లక్షల పైచిలుకు 5జీ నెట్‌వర్క్ బేస్ స్టేషన్లు ఉన్నాయి. ఊక్లా ప్రకారం.. మొత్తం తొమ్మిది స్పీడ్‌టెస్ట్ విభాగాల్లోనూ అవార్డులను దక్కించుకుని భారత్‌లో జియో నంబర్ వన్ నెట్‌వర్క్‌గా నిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment