న్యూఢిల్లీ: ముందస్తు చెల్లింపుల కార్యాచరణలో భాగంగా 2.65 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 21,900 కోట్లు) రుణాలను తీర్చివేసినట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తిరిగి పొందనున్నట్లు గ్రూప్ విడుదల చేసిన క్రెడిట్ నోట్ పేర్కొంది. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నివేదిక తదుపరి అదానీ గ్రూప్ రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తోంది.
లిస్టెడ్ కంపెనీల షేర్ల తనఖా సంబంధిత 2.15 బిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించినట్లు నోట్ వెల్లడించింది. అంతేకాకుండా అంబుజా సిమెంట్ కొనుగోలుకి తీసుకున్న 70 కోట్ల డాలర్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు తెలియజేసింది. 20.3 కోట్ల డాలర్ల వడ్డీతోకలిపి రుణాలు చెల్లించినట్లు వివరించింది. కాగా.. ప్రమోటర్లు గ్రూప్‌లోని నాలుగు లిస్టెడ్ కంపెనీలలో షేర్ల విక్రయం ద్వారా జీక్యూజీ పార్ట్‌నర్స్ నుంచి 1.87 బిలియన్ డాలర్లు(రూ. 15,446 కోట్లు) సమకూర్చుకున్నట్లు క్రెడిట్ నోట్ తెలియజేసింది.
రుణభార తగ్గింపు చర్యలు.. యాజమాన్య పటిష్ట లిక్విడిటీ నిర్వహణ, నిధుల సమీకరణ సమర్థతలను చాటుతున్నట్లు పేర్కొంది.అదానీ గ్రూప్‌లో అకౌంట్ల అవకతవకలు, షేర్ల ధరల కృత్రిమ పెంపు వంటివి జరిగినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. అయితే అదానీ గ్రూప్ వీటిని కొట్టిపారేయడంతోపాటు.. ముందస్తు రుణ చెల్లింపులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment