
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తాజాగా పుదుచ్చేరిలోని కరైకల్ పోర్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరైకల్ పోర్టు విలువను రూ. 1,500–2,000 కోట్లుగా పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే డీల్ కుదుర్చుకోవడం అంత సులభమేమీకాదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు యాజమాన్య వాటాలు, రుణాలు అడ్డంకికావచ్చని తెలియజేశాయి. కరైకల్ పోర్టు ప్రయివేట్(కేపీపీఎల్)కు మార్గ్ లిమిటెడ్ ప్రమోటర్‌కాగా.. 45 శాతం వాటాను కలిగి ఉంది. నాలుగు పీఈ సంస్థలు అసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్, జాకబ్ బాల్స్ క్యాపిటల్, అఫిర్మా క్యాపిటల్, జీఐపీ ఇండియా సంయుక్తంగా పీపీఎల్‌లో 44 శాతం వాటాను పొందాయి. మిగిలిన 11 శాతం వాటా ఎడిల్‌వీజ్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ చేతిలో ఉంది.
రుణాల్లో 97 శాతం
కేపీపీఎల్ రుణ భారం రూ. 2,000 కోట్లు కాగా.. దీనిలో 97 శాతం ఎడిల్‌వీజ్ ఏఆర్‌సీ పీఎస్‌యూ బ్యాంకుల కన్సార్షియం నుంచి బదిలీ చేసుకుంది. దీంతో కేపీపీఎల్‌ను కొనుగోలు చేయాలంటే కంపెనీ విలువకు సంబంధించి ప్రమోటర్లు, పెట్టుబడిదారులు, రుణదాతల మధ్య అవగాహన కుదరవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కేపీపీఎల్‌ను సొంతం చేసుకునే అంశం సంక్లిష్టమైనదిగా వ్యాఖ్యానించాయి.
అవకాశాలిలా..
కేపీపీఎల్‌ను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసేందుకు రెండు అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటిలో తొలుత కంపెనీకున్న రుణ భార చెల్లింపునకు ఎడిల్‌వీజ్‌తో చర్చలు జరపడంతోపాటు.. వాటాదారులకు నగదు చెల్లింపు ద్వారా వాటాలను సొంతం చేసుకోవడం. అయితే ఇది వ్యయభరితమని తెలియజేశాయి. బలహీన ఆర్థికాంశాల రీత్యా కంపెనీ విలువ రూ. 1,500 కోట్లుగా అంచనా. రుణ భారం రూ. 2,000 కోట్లవరకూ ఉంది. ఈ డీల్ ప్రకారం చూస్తే అదానీ పోర్ట్స్ ఇటీవల కొనుగోలు చేసిన కృష్ణపట్నం, గంగవరం పోర్టులకంటే ఖరీదైన వ్యవహారంగా మిగలనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment