ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసినవారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకోనున్నారు.
ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. దానికితోడు విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచుతున్నాయి. దాంతోపాటు దేశీయంగా టైర్2, 3 నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే కంపెనీలు భావించినట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచితే వాటిని నడిపేందుకు పైలట్ల అవసరం ఏర్పడనుంది. ఈ సమస్యను ముందే ఊహించిన టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునేవారికి ట్రెయినింగ్ ఇవ్వనుంది. శిక్షణ పూర్తిచేసుకున్నాక నేరుగా సంస్థలో ఉద్యోగం కల్పించాలని యోచిస్తోంది.
ఇండిగో, స్పైస్‌జెట్ వంటి భారత విమానయాన సంస్థలు విదేశాల్లోని స్వతంత్ర పైలట్ ట్రయినింగ్ అకాడమీలతో అనుబంధంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇండిగో సంస్థ విదేశాల్లోని ఏడు ఫ్టైట్ స్కూళ్లతో అనుబంధం కలిగి ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అమెరికన్ కంపెనీ పైపర్, యూరోపియన్ సంస్థ డైమండ్ నుంచి దాదాపు 30 సింగిల్ ఇంజిన్, నాలుగు మల్టీ ఇంజిన్ విమానాల డెలివరీకి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో విదేశీ అకాడమీలతో అనుబంధంగా ఏర్పడి పైలట్లును నియమించుకోనుంది.
ఎయిరిండియా మాత్రం పైలట్ల కొరత తీర్చుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్న 40శాతంపైగా అభ్యర్థులు విదేశాలకు వెళ్తున్నారు. దాంతో స్థానికంగా పైలట్ల కొరత పెరుగుతోందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఎయిరిండియా శిక్షణలో భాగంగా పైలట్‌లకు టైప్-రేటెడ్ ట్రైనింగ్ అందించేందుకు ఆరు సిమ్యులేటర్‌లను కలిగి ఉన్న ఎయిర్‌బస్, ఎల్3 హారిస్(యూఎస్ ఆధారిత కంపెనీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకోసం గుర్‌గావ్‌లోని తన సొంత శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్‌బస్ A320 లేదా బోయింగ్ 737 వంటి నిర్దిష్ట విమానాలను నడిపేందుకు టైప్-రేటెడ్ శిక్షణ అవసరం అవుతుంది.
ఇదీ చదవండి: విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. 2024లో ప్రతి ఆరు రోజులకు ఒక కొత్త విమానాన్ని ప్రవేశపెడతామని గతంలో కంపెనీ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్స్ తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాసా కంపెనీలు రానున్న రోజుల్లో డెలివరీ ఇచ్చేందుకు వీలుగా దాదాపు 1,250 విమానాలను ఆర్డర్ చేశాయి. ఎయిర్‌ఏషియా ఇండియా మాజీ సీఈఓ సునీల్ భాస్కరన్ ప్రస్తుతం ఎయిరిండియా ఏవియేషన్ అకాడమీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment