వాహనాల్లో కీలక భద్రత ఫీచర్ అయిన ఎయిర్‌బ్యాగ్స్ తయారీ రంగం దేశీయంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 7,000 కోట్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది రూ. 2,500 కోట్లుగా ఉంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. భద్రతా ప్రమాణాలను నియంత్రణ సంస్థ నిబంధనలను కఠినతరం చేస్తుండటం, వాహనాల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్ సంఖ్యను పెంచుతుండటం తదితర అంశాలు ఈ వృద్ధికి ఊతమివ్వనున్నాయి.
ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి కారుకు సగటున మూడు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటున్నాయి. 2023 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ సంఖ్య ఆరుకు చేరనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రూ. 2,400–2,500 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 25–30 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 6,000–7,000 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు.
పెరగనున్న కార్ల తయారీ వ్యయాలు..
2019 జూలైలో ప్రతీ కారుకు ఒక ఎయిర్‌బ్యాగ్ (డ్రైవర్ కోసం)ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత 2022 జనవరి 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు (3.5 టన్నుల కన్నా తక్కువ బరువుండి, ఎనిమిది మంది వరకూ ప్రయాణించగలిగే వాహనాలు) ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను నిర్దేశించింది. 2023 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఎం1 రకం వాహనాలకు రెండు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి కానుంది. దీంతో కార్లలో తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసేందుకు, అదనంగా సెన్సార్లు ఏర్పాటు చేసేందుకు తయారీ కంపెనీలకు వ్యయాల భారం కూడా పెరగనుంది.
అటు ఎయిర్ బ్యాగ్స్ తయారీ సంస్థలు కూడా డిమాండ్‌కి తగ్గట్లు సరఫరా చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో ఉత్పత్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుకోవాల్సి రానుంది. ‘‘పలు కంపెనీలు గత 6–8 నెలల నుంచి సామర్థ్యాలను పెంచుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇందుకోసం వచ్చే 12–18 నెలల్లో కంపెనీలు సుమారు రూ. 1,000 – రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి’’ అని ఇక్రా తెలిపింది.
దిగుమతులపై ఆధారం..
ఎయిర్‌బ్యాగ్ మొత్తం తయారీ వ్యయంలో ఇన్‌ఫ్లేటర్ ఖర్చే దాదాపు 50 శాతంగా ఉంటుండగా, మిగతా భాగం కుషన్ మొదలైన వాటిది ఉంటోంది. వీటికి సంబంధించి దేశీయంగా సాంకేతిక సామర్థ్యాలు, తగినంత స్థాయిలో అమ్మకాలు లేకపోతుండటంతో పరిశ్రమ ప్రస్తుతం తమకు అవసరమైన పరికరాల్లో దాదాపు 60–70 శాతాన్ని విదేశాల్లోని మాతృ సంస్థలు, జాయింట్ వెంచర్ పార్ట్‌నర్లు మొదలైన వాటి నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వీటి తయారీ సామర్థ్యాలను పెంచుకోకపోతే మరింత ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి రానుందని ఇక్రా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment