ఓనమ్, దీపావళి బుకింగ్‌లకు ఆసక్తి
డిమాండ్‌తో ధరలకు రెక్కలు
10–25 శాతం అధికం
కొన్ని మార్గాల్లో తగ్గిన టికెట్ చార్జీలు
న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్‌లకు ఇప్పటి నుంచే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్ సహ సీఈవో రజనీష్ కుమార్ తెలిపారు.
→ అక్టోబర్ 30–నవంబర్ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్ స్టాప్ ఫ్లయిట్ టికెట్ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ.
→ ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్ మార్గంలో ఫ్లయిట్ టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి.
→ ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి.
→ హైదరాబాద్–తిరువనంతపురం మార్గంలో టికెట్ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి.
→ కానీ, పండుగల సీజన్‌లోనే కొన్ని మార్గాల్లో టికెట్ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్ మార్గాల్లో టికెట్ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్‌లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి.
→ ముంబై–అహ్మదాబాద్ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్‌పూర్ మధ్య టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.
విమాన ప్రయాణికుల జోరు
దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్‌తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్ వాటా 4.7 శాతానికి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment