టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను అనుసరించి దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) రెండు వాయిస్-ఓన్లీ చౌక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించాలని ట్రాయ్ ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ప్లాన్‌లను ప్రారంభించిన ఏడు రోజులలోపు ట్రాయ్ సమీక్షిస్తుంది.
ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్ తన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్‌టెల్ తన వెబ్‌సైట్‌లో ప్లాన్లను అప్‌డేట్ చేసింది. సవరించిన ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే..
రూ.469 ప్లాన్
ఇది 84 రోజుల ప్లాన్. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండేది. దీన్ని ప్రస్తుతం రూ. 30 తగ్గించింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందించవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 900 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. ఎటువంటి డేటా అవసరం లేకుండా కాలింగ్, ఎస్‌ఎంఎస్ సేవలు అవసరమయ్యే 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చారు.
రూ. 1849 ప్లాన్
ఇది 365 రోజుల ప్లాన్. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,959. రూ. 110 తగ్గించి రూ. 1,849 లకు తీసుకొచ్చింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ మాట్లాడవచ్చు.
ఉచిత జాతీయ రోమింగ్, 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా దీర్ఘకాలిక వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం దీన్ని రూపొందించారు.
జియో ప్లాన్‌లు
ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించిన మొదటి టెలికం కంపెనీ రిలయన్స్ జియో. 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది. 84 రోజుల ప్లాన్ ధర రూ. 458. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 1,000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక 365-రోజుల ప్లాన్ ధర రూ. 1,958. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఆనందించవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment