న్యూఢిల్లీ: రియాద్, జెడ్డా, దోహా, కువైట్‌కు సర్వీసులు నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ట్రాఫిక్ అనుమతులు లభించినట్టు ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే వెల్లడించారు. ఇది తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే దశగా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా అనుమతులు తీసుకుని, త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆకాశ ఎయిర్ కార్యకలాపాలకు ఈ ఏడాది ఆగస్ట్‌తో ఏడాది ముగిసింది. సంస్థ నిర్వహణలోని బోయింగ్ 738 మ్యాక్స్ విమానాల సంఖ్య 20కు చేరుకుంది. దీంతో అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి.
ఈ ఏడాది చివరికి మరో రెండు విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. బలమైన ఆర్థిక మూలాలతో, వృద్ధి దశలో ఉన్నట్టు దూబే తెలిపారు. సంస్థ వద్ద నగదు నిల్వలు తగినన్ని ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మూడంకెల స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్ చేయనున్నట్టు చెప్పారు. తొలి అంతర్జాతీయ సర్వీసు ఎప్పుడు ప్రారంభించేది ఇప్పుడే చెప్పడం కష్టమని దూబే పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆకాశ ఎయిర్ వారానికి 700 సర్వీసులను, 16 పట్టణాలకు నిర్వహిస్తోంది. దేశీ మార్కెట్‌లో 4.2 శాతం వాటా కలిగి ఉంది.
నిధుల సమస్య లేదు
ఆకాశ ఎయిర్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న వార్తలను ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని వినయ్ దూబే బదులిచ్చారు. సానుకూల నగదు ప్రవాహాలు ఉన్నాయని, మా నిల్వలను పెంచుకుంటూనే ఉంటామన్నారు. కొత్త విమానాలు ఆర్డర్ చేసేందుకు తమకు నిధుల అవసరం లేదన్నారు. జున్‌జున్‌వాలా కుటుంబం సంస్థను వీడుతున్నట్టు వచ్చిన వార్తలు అసంబద్ధమని స్పష్టం చేశారు. తాము దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసినట్టు వారు స్పష్టం చేశారని తెలిపారు. పైలట్ల ఆకస్మిక రాజీనామా, వారికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించగా, అది ముగిసిపోయిందంటూ.. ప్రస్తుతం వృద్ధి దశలో ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment