ముంబై: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగాయి. డిమాండ్ బలంగా ఉందని, కస్టమర్ల రాక పెరిగినట్టు వరక్తులు వెల్లడించారు. గత రెండేళ్లలో చూసినట్టు కరోనా లాక్‌డౌన్‌లు, ఆంక్షలు లేకపోవడం.. రంజాన్ సెలవుదినం కావడం విక్రయాలకు కలిసొచ్చింది. దీంతో అధిక విక్రయాలకు అనుకూలించినట్టు వర్తకులు పేర్కొన్నారు. విక్రయాలను ముందే ఊహించిన వర్తకులు కొంచెం ముందుగానే దుకాణాలను తెరిచి, రాత్రి 10 గంటల వరకు ఉండడం కనిపించింది. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 10 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
‘‘అక్షయ తృతీయ పర్వదినం ఈ ఏడాది చాలా సానుకూలంగా ఉంది. 2019లో నమోదైన గణాంకాలను మించి విక్రయాలను నమోదు చేయగలమని భావిస్తున్నాం. గత రెండేళ్లుగా నిలిచిన డిమాండ్ తోడు కావడం, ధరలు తగ్గడం కలసి వచ్చింది’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సియామ్ మెహ్రా తెలిపారు. బంగారం ధరలు పన్నులతో కలిపి 10 గ్రాముల ధర రూ.48,300 వద్ద ఉన్నట్టు చెప్పారు. 2019 అక్షయ తృతీయతో పోలిస్తే 10 శాతం అధికంగా విక్రయాలు ఉండొచ్చన్నారు. కస్టమర్ల రాక పెరిగినట్టు, 2019తో పోలిస్తే 30 శాతం అధికంగా అమ్మకాలు నమోదైనట్టు పీఎన్‌జీ జ్యుయలర్స్ ఎండీ, సీఈవో సౌరభ్ గడ్గిల్ సైతం తెలిపారు.
మంచి స్పందన..: కస్టమర్ల నుంచి మంచి స్పందన కనిపించినట్టు టాటా గ్రూపు ఆభరణాల సంస్థ తనిష్క్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ నారాయణన్ తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే కస్టమర్ల రాక 30–40 శాతం అధికంగా ఉందని కోల్‌కతా జ్యుయలర్లు తెలిపారు. కొనుగోలుదారులకు కేలండర్లు, స్వీట్ బాక్స్‌లు పంచేందుకు వర్తకులు ఆర్డర్లు ఇచ్చి మరీ సిద్ధం చేసుకోవడం ఈ ఏడాది కనిపించింది.
సానుకూల సెంటిమెంట్
అక్షయ తృతీయ రోజున బంగారం కొనే సంప్రదాయం ఉందని, దీనికితోడు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొనేలా చేసినట్టు కల్యాణ్ జ్యుయలర్స్ ఈడీ రమేష్ కల్యాణ రామన్ చెప్పారు. ‘‘రెండు సంవత్సరాల పాటు లాక్‌డౌన్, ఆంక్షల తర్వాత నూరు శాతం షోరూమ్‌లను తెరిచి ఉంచడం ఈ ఏడాదే. మా షోరూమ్‌లకు కస్టమర్ల రాక గణనీయంగా పెరిగింది’’అని కల్యాణరామన్ తెలిపారు. పెంటప్ డిమాండ్‌తో ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లకు సానుకూల వాతావరణం కనిపించినట్టు కార్ట్‌లేన్ సీవోవో అవనీష్ ఆనంద్ పేర్కొన్నారు.
అక్షయ తృతీయ.. పసిడి వెలుగులు
Published Wed, May 4 2022 1:03 AM | Last Updated on Wed, May 4 2022 11:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment