ఆర్ధిక మాద్యం భయాల కారణంగా ఆదాయం తగ్గిపోతుండడంతో ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 18వేలమందిని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా మరో 1200 అంత కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. ఖర్చుల్ని తగ్గించుకుంటున్న అమెజాన్ వరుస లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో యూకేకి చెందిన ఆ సంస్థ మూడు వేర్ హౌస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 1200మంది ఉద్యోగులపై వేటు పడనుంది. వేర్ హౌస్‌లను ఎందుకు షట్‌డౌన్ చేస్తుందనే అంశంపై స్పష్టత లేనప్పటికి వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు, కస్టమర్లకు మెరుగైన సేవలందించే క్రమంలో కొన్ని వేర్‌హౌస్‌ల మూసివేత, మరికొన్నింటిలో విస్తరణ చేపడతామని, అవసరమైన చోట న్యూ సైట్స్‌ను ఓపెన్ చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
అంతేకాదు తొలగిస్తున్న ఉద్యోగులు ఉపాధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని,లేఆఫ్స్ ఉద్యోగులు అమెజాన్ సంస్థకు చెందిన ఇతర సర్వీసుల్లో లేదా సైట్‌లలో పని చేసే అవకాశాన్ని పొందుతారని కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. రాబోయే మూడేళ్లలో అమెజాన్ ఫిల్‌ఫుల్ సెంటర్లను ప్రారంభించాలని వెల్లడించారు. తద్వారా 2,500మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment