Rs. 2000 Note Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యూజర్లకు చేదువార్త అందించింది. రెండు వేల నోటుకు సంబంధించి కొత్త అప్‌డేట్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ (COD) సేవలపై 2000 నోట్లను అంగీకరించడాన్ని ఇకపై నిలిపివేయనుంది. సెప్టెంబర్ 19 నుండి 2000 కరెన్సీ నోట్లను నగదుగా స్వీకరించడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఉత్పత్తిని థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా డెలివరీ చేస్తే, వీటిని అంగీకరిస్తున్నట్టు వెల్లడించింది. (ఉద్యోగులకు షాక్: గూగుల్‌లో మళ్లీ తొలగింపుల పర్వం)
ఆర్‌బీఐ 2000 కరెన్సీ నోట్లును చలామణినుంచి ఉపసంహరించుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ సేవకు అంగీకరించింది. బ్యాంకుల్లో రూ. 2000 మార్పిడికి గడువు సమీపిస్తున్న తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంటి వద్ద నుంచే రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పించిన సంగతి తెలిసిందే.
కాగా 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాటిని చెలామణి నుండి తొలగించింది. ఒకవేళ మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2.72 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు అందాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 25 న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం , చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి లేదా మార్పిడి అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment