న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్‌ఆర్‌ఎల్) రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ డీల్‌ను సవాల్ చేస్తూ సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ (ఎస్‌ఐఏసీ)ని ఆశ్రయించిన అమెజాన్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే విధిస్తూ ఎస్‌ఐఏసీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యూచర్, అమెజాన్ గ్రూప్‌ల నుంచి చెరొక సభ్యుడు, తటస్థంగా ఉండే మరో సభ్యుడితో త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఏర్పాటు కావొచ్చని, వివాదంపై 90 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాలు స్వాగతిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పైగా విలువ చేసే దేశీ రిటైల్ మార్కెట్లో ఆధిపత్యం సాధించేందుకు రిలయన్స్‌తో అమెజాన్ పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ఈ వివాదం మరింత ఆజ్యం పోయనుంది. అమెజాన్ భారత మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఫ్యూచర్ రిటైల్ వంటి భారతీయ భాగస్వామి అవసరం చాలా ఉంది. మరోవైపు, దూకుడుగా దూసుకెడుతున్న రిలయన్స్ రిటైల్‌కి ఫ్యూచర్ రిటైల్ లభిస్తే .. తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అవకాశం దక్కనుంది.
సత్వరం డీల్ కుదుర్చుకుంటాం: రిలయన్స్
ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్) స్పందించింది. ఒప్పందం ప్రకారం తమకు దఖలు పడ్డ హక్కులను వినియోగించుకుంటామని, మరింత జాప్యం జరగకుండా డీల్ కుదుర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇక, ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు ఫ్యూచర్ రిటైల్ సంకేతాలు ఇచ్చింది.
వివాదం ఇదీ..: ఫ్యూచర్ గ్రూప్‌లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్‌ఆర్‌ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ సంస్థకు 7.3% వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఈ ఫ్యూచర్ కూపన్స్‌లో 49% వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్‌కూ ఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాలు దక్కాయి. ఫ్యూచర్ కూపన్స్‌తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఇటీవలే కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను ఆర్‌ఆర్‌వీఎల్‌కి విక్రయిస్తున్నట్లు ఆగస్టు 20న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌వీఎల్ వేగంగా రిటైల్ రంగంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ డీల్‌ను అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్ కొనుగోలుకు సంబంధించి తమ హక్కులకు భంగం కలుగుతోందంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ను ఆశ్రయించింది.
ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం పతనం...
రిలయన్స్ రిటైల్ – ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి తాత్కాలిక బ్రేక్ పడటంతో ఇంట్రాడేలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు 10 శాతం వరకు పతనమయ్యాయి. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10 శాతం నష్టపోయి రూ.78.15 వద్ద ముగిసింది. ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం క్షీణించి రూ.73.85 వద్ద స్థిరపడింది. ఇక ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ షేర్లు 5 శాతం మేర పతనమై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment