రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్‌లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. దాంతో వారికి సకల సౌకర్యాలు సమకూర్చేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. అందులో భాగంగా ప్రముఖుల కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్‌లను, 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుంది.
క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు ధ్రువీకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలను చేర్చడానికి వీటిని వినియోగిస్తారని చెప్పారు. అనంత్-రాధిక పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.
కొన్ని మీడియా కథనాల ప్రకారం అనంత్-రాధికల పెళ్లికి రాబోయే విదేశీ ప్రముఖుల లిస్ట్ ఈ కింది విధంగా ఉంది.
సౌదీ అరామ్‌కో సీఈవో అమిన్ నాసర్
హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్
భారతీయ సంతతికి చెందిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్
మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీ
ముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్
బీపీ సీఈఓ ముర్రే
అనంత్-రాధికల పెళ్లి నేపథ్యంలో ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నాయి. సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లోని గదుల ఛార్జీ ఒక రాత్రికి సుమారు రూ.13,000గా ఉండేది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
జులై 12న ‘శుభ్ వివాహ్’, జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్‌నగర్‌లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. ఇటీవల జరిగిన సంగీత్ వేడుకల్లో పాప్ సింగర్ జస్టిన్‌బీబర్ సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment