
ఇక మళ్లీ సినిమా పండుగ సందడి ప్రారంభంకానుంది. వరుస పెట్టి బడా సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రేక్షకులు, సినీ అభిమానులు వరుస వినోదాల విందుకు సిద్ధంగా ఉండే సమయం దగ్గరపడింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, ఈటీ, వలిమై చిత్రాల రిలీజ్ డేట్లను అనౌన్స్ చేశారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సినిమా కూడా చేరింది. అమితాబ్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం 'ఝుండ్'. ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అమితాబ్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'మా టీమ్ వచ్చేస్తోంది. మాతో తలపడేందుకు సిద్ధంగా ఉండండి' అని క్యాప్షన్ రాస్తూ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్ చూసిన బిగ్‌బీ అభిమానులు సంబరపడుతున్నారు. కామెంట్స్ ద్వారా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. అలాగే అమితాబ్ కుమార్తె శ్వేతా బచ్చన్, మనవరాలు నవ్య నవేలి నందా, అభిషేక్ బచ్చన్లు కూడా పోస్టర్‌పై తమ స్పందన తెలిపారు. ఈ చిత్రంలో అమితాబ్ ఫుట్‌బాల్ కోచ్‌గా అలరించనున్నారు.