యూనివర్సిటీకి రూ.500 కోట్లు.. ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల జల్లు | Anand Mahindra Donate Rs 500 Crore For Mahindra University In Hyderabad, See More Details Inside - Sakshi
Sakshi News home page

యూనివర్సిటీకి రూ.500 కోట్లు.. ఆనంద్ మహీంద్రాపై ప్రశంసల జల్లు

Published Thu, Mar 28 2024 9:03 AM | Last Updated on Thu, Mar 28 2024 10:45 AM

Anand Mahindra Donate Rs 500 Crore For Mahindra University in Hyderabad - Sakshi

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక స్ఫూర్తిదాయక కథనాలను షేర్ చేస్తూ, అప్పుడప్పుడు కొందరికి రిప్లై ఇస్తుంటారు. ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచిన ఈయన ఇటీవల హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్శిటీ కోసం రూ. 500 కోట్లు కేటాయించి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

ఆనంద్ మహీంద్రా ప్రకటించిన నిధులతో మహీంద్రా యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇంటర్ డిసిప్లినరీ అకడమిక్ ఎక్సలెన్స్ కోసం పాటుపడే మహీంద్రా యూనివర్సిటీ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీటిని ఉపయోగించనున్నారు.

ఆనంద్ మహీంద్రా తల్లి 'ఇందిరా మహీంద్రా' పేరుతో నిర్మించిన ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కూడా వ్యక్తిగతంగా రూ.50 కోట్లను అందించనున్నట్లు హామీ ఇచ్చారు. దీనిని విద్యా రంగంలో.. పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాల్లో అగ్రగామగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇది మహీంద్రా యూనివర్శిటీలో భాగంగా ఉంటుంది.

టెక్ మహీంద్రా మాజీ వైస్-ఛైర్మన్ వినీత్ నాయర్ ఆలోచన ద్వారా పుట్టిన మహీంద్రా యూనివర్సిటీ 2020లో ప్రారంభమైంది. నేడు ఇందులో సుమారు 35 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ వంటి కోర్సులు ఉన్నాయి.

మహీంద్రా యూనివర్సిటీలో సుమారు 4100 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ కూడా ప్రారంభం కాబోతుంది. దీనితో పాటు స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement