సాక్షి, సిటీబ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఫలితంగా హైదరాబాద్‌లో పశ్చిమ, ఉత్తరాది ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు, సరఫరా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ (క్యూ3)లో నగరంలో 11,650 గృహాలు విక్రయం కాగా.. ఇందులో ఈ రెండు జోన్ల వాటానే 92 శాతంగా ఉంది. అలాగే 15,500 యూనిట్లు లాంచింగ్ కాగా.. వెస్ట్, నార్త్ జోన్‌ల వాటా 91 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో విక్రయమైన గృహాలలో భాగ్యనగరం వాటా 13 శాతంగా ఉంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 4 శాతం వృద్ధి. వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో 73 శాతం వృద్ధి నమోదయింది.
జోన్ల వారీగా చూస్తే..
క్యూ3లో నగరంలో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం వెస్ట్ జోన్‌లోనే జరిగాయి. గచ్చిబౌలి, కొండాపూర్, తెల్లాపూర్, మణికొండ, కూకట్‌పల్లి, కోకాపేట, పటాన్‌చెరు వంటి ప్రాంతాలు ఉండే ఈ జోన్ వాటా 49 శాతంగా ఉంది. మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, యాప్రాల్, షామీర్‌పేట వంటి ప్రాంతాలు ఉండే నార్త్ జోన్ 43 శాతం అమ్మకాల వాటా కలిగి ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం ఈ రెండు జోన్లలో విక్రయాలు 1 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో తూర్పు, సెంట్రల్ జోన్‌లలో విక్రయాలు 1 శాతం మేర పెరిగాయి. క్యూ3లోని హైదరాబాద్‌లోని గృహ విక్రయాలలో హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, ఘట్‌కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ఈస్ట్ జోన్ వాటా 3 శాతం, అమీర్‌పేట, పంజగుట్ట, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాలు ఉండే సెంట్రల్ జోన్ వాటా 1 శాతం, శంషాబాద్, ఆదిభట్ల, మహేశ్వరం, షాద్‌నగర్, రాజేంద్రనగర్ వంటి సౌత్ జోన్ 3శాతం వాటాతో ఉన్నాయి.
నగరానిది 17 శాతం వాటా..
గృహ ప్రారంభాలలోనూ హైదరాబాద్ హవా కొనసాగింది. క్యూ3లో ఏడు ప్రధాన నగరాలలోని లాంచింగ్స్‌లో 17 శాతం వాటాతో నగరం రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే మాత్రం నగరంలో లాంచింగ్స్ 2 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన మాత్రం 6 శాతం వృద్ధిలో ఉంది.
నివాస ప్రారంభాలలోనూ పశ్చిమ జోన్‌దే జోరు. క్యూ3లో హైదరాబాద్‌లో జరిగిన లాంచింగ్స్‌లో ఈ జోన్ వాటా 53 శాతం. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 2 శాతం క్షీణత. అలాగే క్యూ2తో పోలిస్తే నార్త్ జోన్‌లో లాంచింగ్స్ 6 శాతం వృద్ధి రేటుతో 32 శాతం నుంచి 38 శాతానికి పెరిగాయి. సౌత్ జోన్ 5 శాతం, ఈస్ట్ జోన్ 4 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
కొత్తగా ప్రారంభమైన గృహాలలే లగ్జరీవే అత్యధికం. క్యూ3లో ప్రారంభమైన ఇళ్లలో 54 శాతం ఈ తరహా నివాసాలే. 30 శాతం వాటా మధ్యస్థాయి గృహాలున్నాయి. అఫర్డబుల్ ఇళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్యూ2లో లాంచింగ్స్‌లో అందుబాటు గృహాల వాటా 3 శాతం కాగా.. క్యూ3 నాటికి 1 శాతానికే పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment