ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల వివాహం ఈనెల 12న అత్యంత విలాసంగా జరిగింది. అబ్బురంగా జరిగిన ఈ వేడుకల విశేషాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సోదరుడు, పెద్దగా వార్తల్లో లేని అనిల్ అంబానీ కోడలు ఎంటర్‌ప్రిన్యూర్ క్రిషా షా (Khrisha Shah) గురించి, ఆమె వ్యవస్థాపక స్ఫూర్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
అనిల్ అంబానీ, టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీని క్రిషా షా వివాహం చేసుకున్నారు. క్రిషా నికుంజ్ ఎంటర్‌ప్రైజెస్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివంగత నికుంజ్ షా, ఫ్యాషన్ డిజైనర్ నీలం షా కుమార్తె ఈ క్రిషా షా. ఈమెకు ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు మిషాల్ షా వ్యాపారవేత్త కాగా సోదరి నృతి షా ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. క్రిషా షా, జై అన్మోల్ అంబానీలు వారి కుటుంబాల ద్వారా పరిచయం అయ్యారు. కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో వీరి వివాహం కూడా విలాసవంతంగానే జరిగింది.
‘డిస్కో’ స్థాపన
క్రిషా షా వృత్తిపరమైన ప్రయాణం యూకేలో యాక్సెంచర్ సంస్థలో ప్రారంభమైంది. అక్కడ ఆమె భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ సర్వీస్ ప్రాజెక్ట్‌లలో సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆమె భారీ సంపాదననిచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ఏర్పాటు కలల వైపు పయనించారు. అలా సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ ‘డిస్కో’ను స్థాపించారు. ఇది ప్రొఫెషనల్స్ కోసం ఆన్‌లైన్ హైపర్ లోకల్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఫ్రీలాన్సర్‌లు, ఎంటర్‌ప్రిన్యూర్లు, ప్రొఫెనల్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వొచ్చు. తమ విశేషాలను పంచుకోవచ్చు.
ఎంటర్‌ప్రిన్యూర్‌గానే కాకుండా క్రిషా షా సామాజిక కార్యకర్త, మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా. ప్రేమ, ఆశ, శాంతి, ఐక్యత విలువలను ప్రోత్సహించే సాంస్కృతిక, మానసిక ఆరోగ్య అవగాహన చొరవ అయిన #LOVEnotfear అనే ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. క్రిషా షా విద్యా నేపథ్యం విషయానికి వస్తే యూఎస్‌లోని యూసీ బర్కిలీ నుంచి పొలిటికల్ ఎకానమీలో బీఏ, ఇంగ్లండ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషల్ పాలసీ అండ్ డెవలప్‌మెంట్‌లో ఎంఎస్‌సీ పట్టా పొందారు.
జై అన్మోల్ అంబానీ, క్రిషా షా దంపతులు ప్రస్తుతం అనిల్ అంబానీ, టీనా అంబానీలతో కలిసి ముంబైలోని పాలి హిల్‌లోని సంపన్న నివాస ప్రాంతంలో తమ 17-అంతస్తుల ఇల్లు, అబోడ్‌లో నివసిస్తున్నారు. వార్తా సంస్థ డీఎన్‌ఏ ఇండియా ప్రకారం దీని విలువ రూ. 5,000 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment