
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56% ఎగసి రూ. 6,187 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 62% జంప్‌చేసి రూ. 5,853 కోట్లను తాకింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,614 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) సైతం 32 శాతం వృద్ధితో రూ. 11,459 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.73% బలపడి 4.26 శాతానికి చేరాయి. ఆదాయం రూ. 21,101 కోట్ల నుంచి రూ. 26,892 కోట్లకు చేరింది. యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) వార్షిక ప్రాతిపదికన 3.17% నుంచి 2.38%కి, నికర ఎన్‌పీఏలు 0.91% నుంచి 0.47%కి దిగివచ్చాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 930 వద్దే ముగిసింది.
చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి