వరదల కారణంగా ఐటీ నగరం బెంగళూరు అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల ఇళ్లలోకి వరదనీరు రావడంతో అక్కడి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తాత్కాలికంగా వారి ఇళ్లను విడిచిపెట్టి హోటల్‌లో బస చేస్తున్నారు. దీంతో నగరంలో హోటళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇదే అవకాశం అన్నట్లు హోటల్ యాజమాన్యాలు ఒక్క రాత్రి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నారట.
ఒక్క రాత్రికి రూ. 30వేలు అయినా దొరకట్లే..
పర్పుల్‌ఫ్రంట్ టెక్నాలజీస్ సీఈఓ, వ్యవస్థాపకురాలు మీనా గిరీసబల్ల చెప్పినట్లు ఓ వార్త పత్రికకు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘యెమలూరులోని మా విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ వరదల్లో చిక్కుకుంది. ఆ తర్వాత మేము ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని హోటల్‌లో మా కుటుంబసభ్యులతో ఒక రోజు బస చేసేందుకు రూ. 42,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఓ పక్క హోటల్ రూమ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ కొందరికీ ఆ గదులు కూడా దొరకట్లేదట.
ఎందుకంటే చాలా నగరంలోని హోటళ్లు రాబోయే వారం రోజులకు పూర్తిగా బుక్ చేసుకున్నట్లు సమాచారం. హోటల్ యజమానుల ప్రకారం.. వరద ప్రభావం అధికంగా ఉండడంతో చాలా మంది ముందుగానే గదులను బుక్ చేసుకున్నారు. వరద నీరు తగ్గినప్పటికీ కూడా వారి ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని.. దీంతో హోటల్‌లో రమ్‌లు దొరకట్లేదని అంటున్నారు.
ఇంకా ఐదు రోజులు ఇంతే..
మరో వైపు నగరవాసులకు మరింత ఆందోళన కలిగిస్తూ వాతావరణ శాఖ (IMD) బెంగళూరులో రాబోయే ఐదు రోజుల పాటు నిరంతర వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏజెన్సీ బుధవారం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాభావ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే వారు ఇతర ప్రాంతాలకు మారాల్సి వస్తోంది. మొదటి అంతస్తు, పై అంతస్తులో నివసించే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్టర్లు, పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం, భారీ వర్షం కారణంగా బెంగళూరులోని 85 ప్రాంతాలు 2,000 ఇళ్లు జలమయమయ్యాయి.
చదవండి: ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ బిల్లులు ఉండాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment