ఇంచెయాన్ (దక్షిణ కొరియా): భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్దిలో భాగం కావాలని ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. భారత్ శతాబ్ధి ఉత్సవాల నాటికి ఆధునిక దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని చెబుతూ.. ఈ 25 ఏళ్ల అమృత కాలం పెట్టుబడులకు ఎన్నో అవకాశాలను తీసుకొస్తుందన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీప ఇంచెయాన్‌లో 56వ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
నూతన భారత్ ఆవిష్కారానికి, మెరుగైన పాలన కోసం నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలను మంత్రి సీతారామన్ వెల్లడించారు. ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్ సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఇటీవల భారత్ చేపట్టిన సంస్కరణలకు తోడు, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ (ఎన్‌ఐపీ), నేషనల్ మోనిటైజేషన్ పైపులైన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ తదితర చర్యలను వివరించారు.
కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ఆశాకిరణంగా నిలిచినట్టు చెప్పారు. భారత పట్ల నమ్మకాన్ని కొనసాగిస్తున్న కొరియా ఇన్వెస్టర్లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాలకు సంబంధించిన పీఎల్‌ఐ పథకంలో పాల్గొనడం పట్ల కొరియా ఇన్వెస్టర్లు ఆసక్తి, అంకితభావం చూపించడాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతారామన్, ఫిజి దేశ ఉప ప్రధాని బిమన్ చంద్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు.
ఏడీబీకి ప్రోత్సాహం
సభ్య దేశాలకు రుణ పంపిణీలో సరికొత్త, రిస్క్ ఆధారిత విధానాలను అనుసరించే విషయమై ఏడీబీకి భారత్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. ఏడీబీ గవర్నర్ల ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్ తరఫున గవర్నర్‌గా మంత్రి సీతారామన్ ఏడీబీ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్లీనరీలో చర్చల ద్వారా చాలా అంశాలకు పరిష్కారం లభిస్తుందని, ఏడీబీకి మార్గదర్శకం లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment