బెంజ్, ఆడి, పోర్స్చే, లంబోర్ఘిని కార్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వింటేజ్ కార్లు కనుమరుగైపోయాయి. దీనికి కారణం.. ఆ కార్లను కంపెనీలు తయారు చేయడం ఆపేయడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వింటేజ్ కార్లు (Vintage Cars) లేదా పాతకాలం కార్లను కొనుగోలు చేయడానికి.. ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు అలాంటి కార్లను కొనుగోలు చేయడం ఓ కలగా పెట్టుకుంటారు. ఇటీవల బెంగళూరు(Bengaluru)కు చెందిన మహిళ ఓ పాతకాలం కారును కొనుగోలు చేసి.. కల నెరవేరిందని సంబరపడిపోయింది.
బెంగళూరుకు చెందిన 'రచన మహదిమనే' అనే మహిళ.. 'ప్రీమియర్ పద్మిని' (Premier Padmini) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి ఈ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మహిళ.. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ అరుదైన కారును కొనుగోలు చేసింది.
బెంగళూరు మహిళ కొనుగోలు చేసిన ప్రీమియం పద్మిని కారు చూడటానికి కొత్త కారు మాదిరిగానే ఉంది. దీని కోసం ఈమె ప్రత్యేకంగా కారుకు మరమ్మతులు చేయించింది. ఈ కారణంగానే ఆ కారు కొత్తదాని మాదిరిగా కనిపిస్తోంది. నా పుట్టినరోజు సందర్భంగా.. నేను కారు కొన్నాను. ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుంచి ఈ కారు గురించి కలలు కన్నాను అని ఆమె వీడియోలో వెల్లడించారు.
గతంలో మన చుట్టూ ఉన్న ప్రీమియర్ పద్మిని కార్లు చాలా ఉండేవి. అయితే ఇప్పుడు నేను దీనిని డ్రైవింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని మహదిమనే పేర్కొంది. పాతకాలపు కార్లను ఉపయోగించాలని అందరికీ ఉంటుంది. కానీ బహుశా అది అందరికీ సాధ్యం కాదు. అయితే పాతకాలపు కారును ఎంతో ఇష్టంగా మళ్ళీ పునరుద్ధరించి, డ్రైవ్ చేయడాన్ని చూసి పలువురు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు వినియోగదారులు ఈ ఐకానిక్ వాహనం గురించి తమ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఫ్యాన్సీ లగ్జరీ కార్ ఛేజింగ్ ప్రపంచంలో ప్రీమియర్ పద్మిని చెప్పుకోదగ్గ మోడల్ అని ఒకరు పేర్కొన్నారు. మా తాత అంబాసిడర్‌లో పని చేసేవారు. అంతే కాకుండా పద్మిని పేరు పెట్టడానికి ఆయన కూడా బాద్యుడు. నేను పద్మినిలో డ్రైవింగ్ నేర్చుకున్నాను అని మరొకరు వ్యాఖ్యానించారు.
ప్రీమియర్ పద్మిని
ప్రీమియర్ పద్మిని కార్లను.. ఇటాలియన్ కంపెనీ 'ఫియట్' లైసెన్స్‌తో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (PAL) తయారు చేసింది. ఇది ఫియట్ 1100 సిరీస్ ఆధారంగా తయారైంది. 1964లో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారుని మొదట ఫియట్ 1100 డిలైట్ అని పిలిచేవారు. ఆ తరువాత దీనిని 1970లలో 'ప్రీమియర్ పద్మిని' పేరుతో పిలిచారు.
ప్రీమియర్ పద్మిని కారు.. గుండ్రని అంచులు, క్రోమ్ గ్రిల్ వంటి వాటితో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద స్టీరింగ్ వీల్, బేసిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐదుగురు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సీటింగ్‌తో కూడిన ఇంటీరియర్‌లు అన్నీ ఉన్నాయి. రోజువారీ వినియోగానికి ఈ కారును ఒకప్పుడు విరివిగా ఉపయోగించారు.
ఇదీ చదవండి: 'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..
1970, 1980లలో సినిమాల్లో ఈ కార్లను విరివిగా ఉపయోగించారు. ఆ తరువాత కాలంలో మారుతి 800 భారతదేశంలో అడుగుపెట్టాక.. ప్రీమియర్ పద్మిని కార్లకు ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. దీంతో కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని 2000వ సంవత్సరంలో నిలిపివేసింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది సినీతారలు తమ గ్యారేజిలలో ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ జాబితాలో రజనీ కాంత్, మమ్ముట్టి వంటివారు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment