ప్రముఖ క్రిప్టోకరెన్సీల విలువ గతకొన్ని రోజులుగా భారీగా పడిపోతుంది. క్రిప్టోకరెన్సీలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ నేడు 4.9 శాతం క్షీణించి 41,008 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. నాలుగు నెలల క్రితం బిట్‌కాయిన్ జీవితకాల గరిష్ఠం 69,000 అమెరికన్ డాలర్లకు చేరుకున్నప్పటి నుంచి సుమారు 40 శాతం పడిపోయింది. ఇక రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఈథర్ విలువ సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు 9 శాతం పడిపోయింది. బైనాన్స్ కాయిన్, సొలానా, కార్డనో, ఎక్స్‌ఆర్‌పీ సైతం గత ఏడు రోజుల్లో 10 శాతానికి పైగా తగ్గాయి. ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశం తర్వాత క్రిప్టోకరెన్సీ ధర భారీగా పడిపోతూ వస్తుంది.
వడ్డీ రేట్ల పెంపు ఊహించిన దాని కంటే ఎక్కువ ఉండొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్‌లో వెల్లడవ్వడం తాజాగా క్రిప్టో కరెన్సీ పతనానికి దోహదం చేసింది. "క్యూ1 2022లో బ్యాలెన్స్ షీట్ తగ్గించాలనే ఫెడ్ తీసుకున్న నిర్ణయం ఈ పతనానికి ప్రధాన కారణం" అని ఫండ్ స్ట్రాట్ వ్యూహకర్తలు తెలిపారు. వివిధ దేశాల్లో దీనికి చట్టబద్ధత లభించే అవకాశం ఉందన్న అంచనాలు, ద్రవ్యోల్బణ నుంచి రక్షణ, మదుపర్ల పోర్ట్‌ఫోలియోకు క్రిప్టోను కూడా జత చేయడం వంటి పరిణామాలతో బిట్‌కాయిన్ విలువ గత ఏడాది 60 శాతం మేర పెరిగింది. వీటిలో కొన్ని అంశాల్లో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుండడంతో తాజా కొనుగోళ్లకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే క్రిప్టోల విలువ క్రమంగా పడిపోతున్నట్లు నిపుణులు తెలిపారు.
జెఎస్టి క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టాడ్ మొరాకిస్ ప్రకారం.. కజఖ్‌స్థాన్‌లోని అశాంతి, అక్కడ గణనీయమైన సంఖ్యలో క్రిప్టో-మైనింగ్ కార్యకలాపాలపై చైనా అణచివేత, విద్యుత్-సరఫరాలో ఇబ్బందులు వంటి కారణాలు కూడా బిట్‌కాయిన్ ధరను ప్రభావితం చేశాయి. నెట్ వర్క్ కంప్యూటింగ్ శక్తి కొలత అయిన బిట్‌కాయిన్ హాష్ రేటు(Blockchain.com డేటా ప్రకారం) జనవరి 1న సుమారు 208 మిలియన్ల రికార్డు నుంచి గురువారానికి 176 మిలియన్ టెరాహాషెస్ కు పడిపోయింది.
(చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment